అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-03-09T06:56:54+05:30 IST

గిరిజన గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సోమవారం పరీక్ష ఆలస్యంగా నిర్వహించడంపై అభ్యర్థులు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళన
ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయ అభ్యర్థులు


పాడేరురూరల్‌, మార్చి 8: గిరిజన గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సోమవారం పరీక్ష ఆలస్యంగా నిర్వహించడంపై అభ్యర్థులు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.  ఐటీడీఏ విద్యాశాఖ అధికారులు సోమవారం ఉదయం పది గంటలకు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడంతో అభ్యర్థులు ఉదయం ఎనిమిది గంటలకే స్థానిక ఏపీఆర్‌ కళాశాల వద్దకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటలు అయినా పరీక్ష నిర్వహించకపోవడంతో వారంతా ఐటీడీఏ కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన టీడబ్ల్యూ డీడీ జి.విజయకుమార్‌ వారితో చర్చించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి పరీక్ష నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు.

228 మంది హాజరు

విశాఖ మన్యంలోని గిరిజన గురుకులాలు, ఏకలవ్య పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీకి సోమవారం నిర్వహించిన పరీక్షకు 228 మంది అభ్యర్థులు హాజరయ్యారని గిరిజన గురకుల (బాలికల) కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌జీ.కిశోర్‌బాబు తెలిపారు.  ఐటీడీఏ నుంచి ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్‌కు 11 మండలాలకు చెందిన 373 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షకు 228 మంది మాత్రమే హాజరయ్యారని ఆయన తెలిపారు.


Updated Date - 2021-03-09T06:56:54+05:30 IST