
అంబేడ్కర్ జయంతి నుంచి పాదయాత్ర
19 నియోజకవర్గాల్లో గెలుపు కీలకం
బీజేపీ నాయకులకు బండి సంజయ్ పిలుపు
హైదరాబాద్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ నియోజకవర్గాల్లో అభివృద్ధి.. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రులు ఇచ్చిన హామీల అమలు కోసం వచ్చే మూడు నెలలు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నాయకులకు సూచించారు. ‘దళితులకిచ్చిన హామీలను టీఆర్ఎస్ ఫ్రభుత్వం విస్మరిస్తూ దళిత ద్రోహిగా మారింది. దళిత సీఎం, దళిత బంధు, దళితులకు మూడెకరాల హామీలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. అదే సమయంలో దళిత, గిరిజన, బీసీల పట్ల బీజేపీ సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు. ‘‘మిషన్-19 పేరిట రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని ఏర్పాటు చేశాం. ఆయా నియోజకవర్గాల్లో ఎస్సీలతోపాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలను బీజేపీవైపు మళ్లించడంతోపాటు టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకునేలా కార్యాచరణ రూపొందించాలి. ఆయా స్థానాల్లో అంతిమంగా కాషాయ జెండా ఎగరేసే బాధ్యత మీదే’’ అని సంజయ్ అన్నారు. సోమవారం నగరంలోని ఒక హోటల్లో బీజేపీ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఎస్సీ ఓట్లను మాత్రమే కాకుండా ఆయా నియోజకవర్గాల్లోని ఇతర సామాజిక వర్గాల ఓట్లను కూడా గణనీయంగా రాబట్టేలా కార్యాచరణను రూపొందించాలని సంజయ్ పిలుపునిచ్చారు. కాగా, బీజేపీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం బుధవారం గచ్చిబౌలిలో జరగనుంది.
బీడీఎస్ పరీక్షలను వాయిదా వేయాలి..
బీడీఎస్ పరీక్షలను వాయిదా వేయాలని బండి సంజయ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కొవిడ్‌తో చాలా మంది విద్యార్థులు ఐసొలేషన్‌లో ఉన్నారని, పరీక్షలు ఎలా రాస్తారని సంజయ్ ప్రశ్నించారు. కాగా, బీజేపీలో అసమ్మతి నేతలపై అంతర్గత విచారణ సోమవారం ప్రారంభమైంది. కరీంనగర్, నిజామాబాద్ ఘటనలపై అంతర్గత విచారణ బాధ్యతలను ఎన్.ఇంద్రసేనారెడ్డికి పార్టీ అప్పగించింది.