ఆంక్షలు షురూ.. పిల్లల వ్యాక్సినేషన్‌కు పేర్ల నమోదు

ABN , First Publish Date - 2022-01-02T14:40:22+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌, రూపాంతరం చెందిన ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సడలింపుల లాక్‌డౌన్‌ను రద్దు చేసి కొత్త ఆంక్షలతో

ఆంక్షలు షురూ.. పిల్లల వ్యాక్సినేషన్‌కు పేర్ల నమోదు

చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌, రూపాంతరం చెందిన ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సడలింపుల లాక్‌డౌన్‌ను రద్దు చేసి కొత్త ఆంక్షలతో లాక్‌డౌన్‌ అమలు చేయడానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. సినిమా థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులను అనుమతించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, టీషాపులు, దుస్తులు, నగల దుకాణాల్లో 50 శాతం మంది కస్టమర్లనే అనుమతించారు. అదికూడా కస్టమర్లందరినీ భౌతిక దూరం పాటించేలా హోటళ్ళ యజమానులు తగు చర్యలు చేపట్టారు. సినిమా థియేటర్లలో సగం సీట్లను ఖాళీగా ఉంచి ప్రేక్షకులను అనుమతించారు. కొత్త ఆంక్షలను సక్రమంగా అమలవుతున్నాయో లేదో పరిశీలించడానికి గ్రేటర్‌ చెన్నై కార్పొ రేషన్‌ 15 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు నగరమంతటా సంచరిస్తూ మాస్కులు ధరించనివారికి జరిమానా విధిస్తున్నారు. ఈ విషయమై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌బేదీ మాట్లాడుతూ నగరంలో వైరస్‌ కేసులు ఊహించని విధంగా అధికమవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన కరోనా కట్టుబాట్లను ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరంలో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోందన్నారు. నగరవాసులంతా పదిరోజులపాటు కొత్త కట్టబాట్లను పాటిస్తేనే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని హెచ్చరించారు.


రేపు పిల్లలకు వ్యాక్సిన్‌..

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 15-18 యేళ్లలోపువారికి టీకాలు వేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించనున్నారు. ఈ వయస్సులోపువారు రాష్ట్రంలో 33.20 లక్షలదాకా ఉన్నారని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వీరందరికీ కోవ్యాక్సిన్‌ టీకాలు వేయడానికి ఆ శాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 15 నుంచి 18 యేళ్లలోపు వారంతా శనివారం నుంచి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అదే సమయంలో పాఠశాలల్లో చదువుతున్న ఈ వయస్సు బాలబాలికల వివరాలను ప్రధానో పాధ్యాయులు సేకరించే పనుల్లో తలమునకలయ్యారు. ఈ వివరాలు అందిన తర్వాత ఆయా పాఠశాలలల్లోనే వ్యాక్సిన్‌ వేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ టీకా వేసుకోవడానికి ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్‌, రేషన్‌కార్డు ఏదో ఒకటి చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-02T14:40:22+05:30 IST