అనాలోచిత నిర్ణయాలతో అవస్థలు

ABN , First Publish Date - 2021-01-06T05:50:19+05:30 IST

ప్రజల జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే బాధ్యతల్లో ఉన్నవారు ఆలోచనాయుతంగా వ్యవహరించకుంటే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు...

అనాలోచిత నిర్ణయాలతో అవస్థలు

కేంద్రప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం గతంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని ఇప్పుడు వెనుకంజ వేసింది. కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేయలేదనే అపవాదును మూటగట్టుకుంది. ఇన్నాళ్ళకు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్‌ చెప్పించడం గర్హనీయం.


ప్రజల జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే బాధ్యతల్లో ఉన్నవారు ఆలోచనాయుతంగా వ్యవహరించకుంటే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఇలాంటి దుస్థితినే తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటోంది. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పక తప్పదు. కేసీఆర్‌ ఇప్పుడు తన అనాలోచిత నిర్ణయాలను ఉపసంహరించుకుంటున్నా జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


కేసీఆర్ హడావిడిగా నిర్ణయించి వెనుకంజ వేసిన వాటిలో ప్రధానమైనది నియంత్రిత వ్యవసాయ విధానం. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా బెదిరించి తాను చెప్పిన పంటలే సాగు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. చెప్పిన పంటలు వేయకపోతే రైతుబంధు ఆపేస్తానని కూడా హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక నిస్సహాయ స్థితిలో రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలు పండించారు. పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధరకు కొనుగోళ్లు చేయకపోగా, అసలే తీరని కష్టాల్లో ఉన్న రైతులను నట్టేట ముంచి చివరికి కేంద్రప్రభుత్వం మీదకు నెట్టి చేతులు దులుపేసుకునే విఫలయత్నం చేశారు. అలాగే కేంద్రం తీసుకు వచ్చిన కొత్త రైతు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించి రాష్ట్రబంద్‌కు కూడా పిలుపునిచ్చి అభాసుపాలైన కేసీఆర్ ఇప్పుడు అవే రైతు చట్టాలను ఉపయోగించుకుని రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని సుద్దులు చెబుతున్నారు! భూముల రిజిష్ట్రేషన్‌లకు సర్వరోగ నివారిణి పేరిట ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అదీ ఆదిలోనే అభాసుపాలైంది. హైకోర్టు కొరడా జళిపించడంతో సందేహాలు తీర్చలేక, అమలులో సమస్యలు పరిష్కరించలేక ప్రభుత్వం చతికిలపడింది. కేసీఆర్‌ కళ్ళు తెరిచేసరికి 4 నెలలు గడిచిపోయాయి. 2 లక్షలకు పైగా పాత రిజిస్ట్రేషన్లకు సంబంధించిన భూముల ముటేషన్లు పెండింగ్‌లో పడ్డాయి. రిజిస్ట్రేషన్లు జరుగక రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. మరో అనాలోచిత నిర్ణయమే ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్లు. క్రమబద్ధీకరణ పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ఖజానాను నింపేద్దామనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజావ్యతిరేకత చెంపపెట్టులాగా మారి తలనొప్పి పెరగడంతో ఇప్పుడు మళ్ళీ తోకముడిచింది. ఎల్‌ఆర్ఎస్ లేకున్నా భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రకటించాల్సి వచ్చింది.


కేంద్రప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి తొందరపాటు నిర్ణయమే తీసుకుని ఇప్పుడు వెనుకంజ వేసింది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోగా, దానికంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ అన్ని విధాలా మంచిదని, దీన్ని మించిన పథకం దేశంలో మరోటి లేదని బీరాలు పలికింది. ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న కరోనాను కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లో చేర్చడంతో ఇప్పుడైనా ఆ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు కోరినా పెడచెవిన పెట్టింది. కనీసం కరోనాను ఆరోగ్యశ్రీలోనైనా చేర్చాలని ప్రజలు, ప్రతిపక్షాలు మొత్తుకున్నా కేసిఆర్ మనసు కరుగలేదు. దీంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనాకు ఖరీదైన చికిత్స చేయించుకోలేక, ప్రభుత్వ వైద్యశాలల్లో సరయిన సౌకర్యాలు, సేవలు, పడకలు దొరకక ఎంతో మంది నిరుపేద అభాగ్యులు ప్రాణాలు వదిలారు. మరెంతోమంది అప్పుల పాలయ్యారు. కనీసం ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలల్లో ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్న ఫీజులనైనా నియంత్రించలేకపోవడంతో వాటి యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గినదని, అక్రమంగా ప్రభుత్వంలోని పెద్దలు డబ్బులు వసూలు చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేయ లేదనే అపవాదును మూటగట్టుకుంది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించినట్లు సిఎస్ ద్వారా కేంద్రప్రభుత్వానికి కేసీఆర్‌ చెప్పించడం గర్హనీయం. 


రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం హడావిడి చేయడం మొదలెట్టింది. ఇందులో చిత్తశుద్ధి ఎంతో ఖాళీలు పూర్తి చేస్తే గాని నమ్మే పరిస్థితి లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. లక్షకు పైగా ఖాళీలు ఉంటే కేవలం 50 వేల ఖాళీలు భర్తీ చేయాలనుకోవడంపై కూడా నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాల్లో ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నది. ఆర్‌టిసి కార్మికుల సమ్మె విషయంలో కూడా ఇలాగే అనాలోచితంగా వ్యవహరించి పలువురు ఉద్యోగులు ఆందోళనతో ప్రాణాలు తీసుకునే లాగా చేశారు. ఆ సంస్థను ప్రైవేటీకరిస్తామంటూ కేసీఆర్‌ వారిని బెదిరించే యత్నం కూడా చేశారు. చివరకు కేంద్రప్రభుత్వం ఆర్‌టిసీని కాపాడేందుకు ఉద్యోగుల పక్షాన నిలువడంతో, తప్పనిసరి పరిస్థితులలో వారిని భోజనానికి పిలిచి ఉద్ధరిస్తున్నట్టు ఎలా ఉపన్యసించారో మనందరికీ తెలిసిందే. ఇటీవల వరదలకు హైదరాబాద్ ప్రజానీకం తీవ్రంగా నష్టపోతే వారికి మానవతా దృక్పథంతో అందించాల్సిన సహాయంలో కూడా టిఆర్‌ఎస్ నాయకులు చేతివాటం ప్రదర్శించడం విమర్శల పాలైంది. దీంతో ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని, నెపాన్ని బిజెపి మీదికి, నెట్టేసే ప్రయత్నం చేస్తూ బండి సంజయ్ పేరుతో నకిలీ లేఖ సృష్టించడం కూడా ప్రజలంతా గమనించారు. నిజం నిప్పులాగా ఎప్పటికయినా బయట పడుతుంది. బండి సంజయ్ పేరుతో రాసిన లేఖ ఒక అబద్ధమని ప్రజలు నమ్మారు కాబట్టే టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇన్ని విధాలుగా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న సలహాదారులెవరో వారి ఉద్దేశాలేమిటో ప్రజలకు అంతుబట్టడంలేదు. మొత్తం మీద సామాన్య ప్రజానీకం మాత్రం తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికయినా టిఆర్‌ఎస్ ప్రభుత్వం కళ్ళు తెరచి ప్రజల కష్టాలను తీర్చక పోతే దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రాబోయే ఎన్నికల్లో పునరావృతమవుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

శ్యామ్ సుందర్ వరయోగి

Updated Date - 2021-01-06T05:50:19+05:30 IST