అధ్వాన రోడ్లతో అవస్థలు

ABN , First Publish Date - 2022-01-29T06:29:45+05:30 IST

బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.కోట్లలో నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న సర్వీస్‌ రోడ్ల ఏర్పాటుకు నిధులను

అధ్వాన రోడ్లతో అవస్థలు
గుంతల మయంగా శాలిగౌరారం గురజాల రోడ్డు

 గుంతలమయంగా మారిన ప్రధాన రహదారులు 

పట్టించుకోని అధికారులు 

ప్రమాదాలబారిన పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు

నార్కట్‌పల్లి: బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.కోట్లలో నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న సర్వీస్‌ రోడ్ల ఏర్పాటుకు నిధులను విడుదల చేయడంలేదు. దీంతో నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి పరిఽధిలో పలు గ్రామాల్లో సర్వీస్‌ రోడ్లు ఐదేళ్లుగా అసంపూర్తిగానే మిగిలాయి. సర్వీస్‌ రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యమే సర్వీస్‌ రోడ్లు పూర్తికాకపోవడానికి కారణమని తెలుస్తోంది. నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై సుమారు 80 కి.మీల పరిధిలో వేయాల్సిన సర్వీస్‌ రోడ్లకు స్థల సేకరణ పూర్తయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే పూర్తికావడం లేదన్న ఆరోపణలున్నాయి. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారికి సంబంధించి రాష్ట్ర పరిధిలోని సర్వీస్‌ రోడ్ల పూర్తికి గాను సుమారు రూ.23 కోట్ల మేర నిధులు కావాల్సి ఉన్నట్లు అంచనా. కానీ నిధులు విడుదల కాకపోవడంతో నల్లగొండ మున్సిపాలిటీ పరిఽధిలోని చర్లపల్లి వద్ద తరుచూ ప్రమాదాలు జరిగి ప్రాణాపాయం ఎక్కువగా ఉండటంతో కలెక్టర్‌ తన నిధులను కేటాయించి సర్వీస్‌ రోడ్ల పూర్తికి చొరవ చూపినట్లు సమాచారం. మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్‌ రోడ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. 


అధ్వానంగా లోతట్టు ప్రాంతాలు 

దేవరకొండ:  దేవరకొండ పట్టణంలో కొద్దిపాటి వర్షాలకే లోతట్టు కాలనీలు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 4, 5 వార్డులలో ఉన్న ఖాళీ స్థలంలోకి వర్షపునీరు భారీగా చేరడంతో దోమల బెడద అధికమవడంతోపాటు, దురువాసన వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలలో నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని, కంపచెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. 


 రహదారి ఇలా.. ప్రయాణం ఎలా

చింతపల్లి: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న వీటీనగర్‌ బీటీ రహదారి ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మండలంలోని వెంకటేశ్వరనగర్‌(వీటీనగర్‌) నుంచి నల్లగొండకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. చిన్నపాటి చినుకుపడితే రహదారి అంతా చిత్తడిగా మారుతుంది. రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. 


అధికారులు.. స్పందించరూ

మిర్యాలగూడటౌన్‌:  పట్టణంలోని చర్చీ రోడ్‌లో ప్రయాణిస్తే నిత్య నరకాన్ని చూసినట్లుగా ఉంటుంది. విద్యా, వైద్యసంస్థలతోపాటు వ్యాపార సముదాయాలు అధికంగా ఉండటంతోపాటు పలు కాలనీలకు దూరభారం తగ్గుతుంది. అందుకే ఈ మార్గంలో సైకిళ్ల నుంచి లారీల వరకూ ఈ రహదారిలో ప్రయాణిస్తుంటాయి. అయితే అడుగడుగునా గుంతలు, యాభై మీటర్లకో స్పీడ్‌ బ్రేకర్‌ ఉండటంతో వాహనదారుల వెతలు వర్ణనాతీతం.  


సమస్యల వలయంలో గుర్రంపోడు

గుర్రంపోడు: గుర్రంపోడు మండలకేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. మండల కేంద్రంలో ప్రధానంగా  డ్రైనేజీలులేక నాంపల్లి రోడ్డులోని వీధుల్లో వర్షం పడితే చాలు నీరంతా ఇళ్లలోకి చేరుతోంది. అదే విధంగా గుర్రంపోడులో బస్టాండ్‌ లేకపోవటంతో ప్రయాణికులు రోడ్డపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రానికి పాఠశాలకు వచ్చే విద్యార్థులతో పాటు ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చేవారు, నల్లగొండ, దేవరకొండకు ప్రయాణికులు వెళ్తుంటారు. మండలకేంద్రంలో కనీసం బస్‌షెల్టర్‌ కూడా లేకపోవటంతో రోడ్డుపైనే నిలబడి నిరీక్షిస్తుంటారు. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. 


ప్రయాణమంటేనే జంకుతున్నారు

శాలిగౌరారం: ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం సమస్తం గుంతలమయం అన్న చందంగా శాలిగౌరారం మండల రోడ్ల దుస్థితి. శాలిగౌరారం మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు గుంతలు ఏర్పడి అధ్వానంగా మారి ప్రాణసంకటంగా ఉన్నా మరమ్మతులు చేయటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే శాలిగౌరారం గురజాల ప్రధాన రహదారిపై ప్రయాణించేందుకు వాహనదారులు జంకుతున్నారు. శాలిగౌరారం నుంచి మోత్కూరు వరకు 30 కిలో మీటర్ల పొడవున్నా ఈ రోడ్డు అక్కడక్కడ దెబ్బతిన్నప్పటికీ అత్యధికంగా శాలిగౌరారం నుంచి గురజాల వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర పూర్తిగా గుంతలు ఏర్పడి ప్రయాణించేందుకు వీలులేకుండా పోవటంతో వాహనదారులు ఈ దారిగుండా ప్రయాణించేందుకు భయపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న  అంచులకు మట్టికొట్టుకుపోవటంతో ప్రమాదకరంగా మారాయి.  

Updated Date - 2022-01-29T06:29:45+05:30 IST