సీపీఎం నాయకులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2022-06-25T05:50:47+05:30 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని 23వ వార్డులో నిర్వహించారు.

సీపీఎం నాయకులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం
గుత్తిలో ఎమ్మెల్యేతో వాదిస్తున్న సీపీఎం నాయకులు

గుత్తి, జూన24: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని 23వ వార్డులో నిర్వహించారు. ఈ క్రమంలో సీపీఎం నాయకులు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను వివరించేందుకు వెళ్లిన సీపీఎం నాయకులను ‘మీరు అధికారంలోకి ఎన్నడూ రారు, పోరాటాలకే పరిమితం’ అంటూ ఎమ్మెల్యే హేళనగా మాట్లాడారు. దీంతో సీపీఎం నాయకులు.. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. సీపీఎం నాయకులు ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని మున్సిపల్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులు మున్సిపల్‌ కార్యాలయంలో లేకపోవడంతో 23వ వార్డులో ఎమ్మెల్యే పర్యటన ఉందని తెలుసుకున్న సీపీఎం నాయకులు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ పట్టణ కౌన్వినర్‌ హుసేనపీరాతోపాటు వైసీపీ నాయకులు సీపీఎం నాయకులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్లకూడదని నిలిపివేశారు. మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించామని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు, మున్సిపల్‌ కమిషనర్‌ ఇరువర్గాల వారికి సర్దిచెప్పి ఎమ్మెల్యే వద్దకు పంపారు. ఎమ్మెల్యేకు వార్డు సమస్యలను వివరిస్తుండగా ‘మీరు జడ్‌ వీరారెడ్డి కాలనీ విషయమే మాట్లాడతారు, కాని మేము నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో పర్యటించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం..’ అంటూ ఎమ్మెల్యే అన్నారు. తాము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని చేపట్టి సమస్యలు తెలుసుకుని వివరించడానికి వచ్చామన్నారు. వినతి పత్రాన్ని తీసుకున్న ఎమ్మెల్యే ‘మీరు పోరాటాలు చేసేందుకే ఉన్నారని తాము అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తున్నాం’ అని పేర్కొనడంతో ఏమి అభివృద్ధి చేస్తున్నారని డ్రైనేజీలు, తాగునీటి సమస్య, రోడ్ల సమస్య అలాగే ఉందని ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. దీంతో  మీరు ఏనాడు అధికారంలోకి రారని ఎమ్మెల్యే హేళనగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం నాయకులు వాగ్వాదానికి దిగారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు కనుమరగయ్యానే ఉద్దేశ్యంతో అలా మాట్లాడనని ఎమ్మెల్యే వివరించగా దీంతో తిరిగి సీపీఎం నాయకులు ఆగ్రహించి తమ సిద్ధాంతాలు కనుమరుగు కాలేదన్నారు. జడ్‌ వీరారెడ్డి కాలనీలో అంగనవాడీ కేంద్రాన్ని, రోడ్లు ఏర్పాటు చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సీపీఎం నాయకులను పంపించి వేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రామకృష్ణ, పట్టణ కార్యదర్శి నిర్మల, ఐద్వా మండల కార్యదర్శి రేణుక, కవిత, కేవీపీఎస్‌ మండల కార్యదర్శి మల్లికార్జున, సీఐటీయూ మండల అధ్యక్షుడు మల్లేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T05:50:47+05:30 IST