వినాయకుడి నిమజ్జనంలో ఘర్షణ

ABN , First Publish Date - 2021-09-19T04:52:50+05:30 IST

దుబ్బాక మండలం పద్మశాలి గడ్డ గ్రామపంచాయతీలోని నర్లంగగడ్డలో శనివారం వినాయక నిమజ్జనోత్సవంలో జరిగిన ఘర్షణ వివాదానికి దారితీసింది. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామ వార్డు సభ్యుడు సీఐ కార్యాలయం ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వినాయకుడి నిమజ్జనంలో ఘర్షణ

ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదంటూ వార్డు సభ్యుడి ఆత్మహత్యాయత్నం


దుబ్బాక, సెప్టెంబరు 18 : దుబ్బాక మండలం పద్మశాలి గడ్డ గ్రామపంచాయతీలోని నర్లంగగడ్డలో శనివారం వినాయక నిమజ్జనోత్సవంలో జరిగిన ఘర్షణ వివాదానికి దారితీసింది. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామ వార్డు సభ్యుడు సీఐ కార్యాలయం ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నర్లంగగడ్డలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనోత్సవంలో ఐదో వార్డు సభ్యుడు ఎమ్మ యాదగిరి వర్గీయులు, మహిళలు కోలాటం ఆడుతూ రంగులు చల్లుకుంటున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఎమ్మ లింగం ఇంట్లో ఆ రంగులు పడ్డాయి. దీంతో ఆగ్రహానికి గురైన లింగం అతని అనుచరులు వార్డు సభ్యుడు యాదగిరిని, వారి అనుచరులను దూషించాడు. అంతేగాక యాదగిరి, మహిళపై దాడికి యత్నించారు. దీంతో అక్కడున్న మహిళలు లింగం కుటుంబీకులపై చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసి ఇంటికి పంపించారు. అనంతరం యాదగిరి, ఆయన భార్య, మరికొంతమంది పోలీసుస్టేషన్‌కు వెళ్లి లింగంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించ లేదు. దీంతో వార్డు సభ్యుడు ఎమ్మ యాదగిరి తన వెంట పెట్రోలును ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గ్రామస్థులు వారించి యాదగిరి చేతులో నుంచి పెట్రోలు బాటిల్‌ను లాక్కున్నారు. దుబ్బాక సీఐ హరికృష్ణ ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. సంఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.


Updated Date - 2021-09-19T04:52:50+05:30 IST