మోదం.. ఖేదం!

ABN , First Publish Date - 2022-01-28T06:21:08+05:30 IST

ఇప్పుడు కల్లూరు, కర్నూలు వేరు కాదు. రెండూ కలిసిపోయాయి. ఓర్వకల్లు కూడా 25 కి.మీ. దూరంలోనే ఉంది. మమ్మల్ని కర్నూలు జిల్లాలోనే విలీనం చేయడం సబబు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. నంద్యాలలో విలీనం చేస్తే సుమారు 70 కి.మీ. దూరం వెళ్లాల్సి వచ్చేది.

మోదం.. ఖేదం!

పాణ్యం నియోజకవర్గాన్ని చేర్చడంపై భిన్నాభిప్రాయాలు
కర్నూలుకు మిగిలింది ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రియల్‌ ప్రాంతాలే
నంద్యాలకు దూరం చేశారంటున్న పాణ్యం, గడివేముల వాసులు
తమకు కర్నూలే మేలంటున్న ఓర్వకల్లు, కల్లూరు ప్రజలు
తెరపైకి రాయలసీమను 10-11 జిల్లాలు చేయాలన్న వాదన


కర్నూలు, ఆంధ్రజ్యోతి: ఇప్పుడు కల్లూరు, కర్నూలు వేరు కాదు. రెండూ కలిసిపోయాయి. ఓర్వకల్లు కూడా 25 కి.మీ. దూరంలోనే ఉంది. మమ్మల్ని కర్నూలు జిల్లాలోనే విలీనం చేయడం సబబు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. నంద్యాలలో విలీనం చేస్తే సుమారు 70 కి.మీ. దూరం వెళ్లాల్సి వచ్చేది.

-పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు, ఓర్వకల్లు వాసుల అభిప్రాయం ఇది.

14 కి.మీ. దూరాన ఉన్న నంద్యాలను కాదని 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలులో విలీనం చేస్తారా? మా దైనందిక జీవితమంతా నంద్యాలతోనే ముడిపడి ఉంది. ఇప్పుడు కర్నూలులో కలిపేస్తే మా పరిస్థితి ఏంటి? మా ప్రాంత అభివృద్ధి అడుగంటి పోతుంది. సమస్యలు ఎక్కడివక్కడే ఉంటాయి.

-పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం, గడివేముల వాసుల ఆవేదన ఇది.

భిన్నాభిప్రాయాలు..

పాణ్యం వల్ల కర్నూలుకు పెద్దగా ఒరిగిందేమీ లేకపోయినా ఉన్నంతలో ఊరట పొంది సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే పాణ్యం, గడివేములవాసులు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబడు తున్నారు. నంద్యాలకు దగ్గరగా ఉన్న తమను 60-70 కి.మీ. దూరంలోని కర్నూలు జిల్లాలో కలపడం సమంజసం కాదన్న వాదన లు పుట్టుకొస్తున్నాయి. ఆ రెండు మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలని పలువురు కోరుతున్నారు. ఈ మేరకు ఈ రెండు మండ లాల్లోని వివిధ ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కర్నూలులో కలపడం వల్ల ఈ మండలాల అభివృద్ధి నిలిచిపోతుందని అంటున్నారు. మిగతా రెండు మండలాల ప్రజల అభిప్రాయం వేరుగా ఉంది. కల్లూరు ఇప్పటికే నగరంలో అంతర్భాగంగా ఉంది. ఓర్వకల్లు ప్రజలు ఏ చిన్న పనికైనా కర్నూలుకే వస్తారు. ద్విచక్ర వాహనం మీద అరగంట ప్రయాణం అంతే. దీంతో తమను కర్నూలులో కలపడం సబబేనని వీరు చెబుతున్నారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలంలో 1,96,268, పాణ్యంలో 51,420 మంది, గడివేములలో 42,810, ఓర్వకల్లులో 58,437 మంది జనాభా ఉండగా 3,10,957 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కర్నూలులో కలిసిపోయిన కల్లూరు, సమీపంలోని ఓర్వకల్లును కర్నూలు జిల్లాలో కలిపి, పాణ్యం, గడివేములను నంద్యాలలో కలపాలని అధిక శాతం మంది కోరుతున్నారు.

ఇది మూర్ఖత్వం

పాణ్యం, గడివేముల మండలాలను కర్నూలు జిల్లాలో విలీనం చేయడం మూర్ఖత్వం. 14 కి.మీ. దూరంలోని నంద్యాలను కాదని 70 కి.మీ. దూరంలోని కర్నూలులో విలీనం చేయాలన్న ప్రతిపాదన సరికాదు. కొత్త జిల్లాల గెజిట్‌తో పాణ్యం, గడివేముల మండలాల ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాలలో కలపకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతాం.

-రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా మాజీ ఉపాఽధ్యక్షుడు

ఇదేమి పరిపాలన సౌలభ్యం

పరిపాలన సౌలభ్యమంటే ప్రజలకు ఇబ్బందులు తొలగించడమే కానీ పెంచడం కాదు. పాణ్యం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నంద్యాల జిల్లా కలను ఈ నిర్ణయం నిరాశకు గురిచేసింది. ఇప్పటికే పాణ్యం మండలం అభివృద్ధికి నోచుకోకపోగా వెనకబడింది. ఈ నిర్ణయంతో మరింత వెనుకబాటుతనానికి గురవుతుంది. మండలంలో డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రతిపాదనలు ఉన్నా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే ఆందోళన చేపడతాం.

-దేవదత్తు, మాలమహానాడు డివిజన్‌ అధ్యక్షుడు

నాయకుల లబ్ధి కోసమే..

కొందరు నాయకుల లబ్ధి కోసం పాణ్యం, గడివేముల మండలాలను పణంగా పెట్టడం అన్యాయం. పావుగంటలో నంద్యాలకు వెళ్లి పనులు చేసుకుని తిరిగి వచ్చే రైతులు, విద్యార్థులు, వ్యాపారులు కర్నూలు జిల్లాలో చేర్చితే తీవ్ర అన్యాయమైపోతారు. తమకిష్టానుసారంగా నియోజకవర్గాలు మార్చితే ప్రజలు పట్టనట్టు ఉండరు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆందోళన చేపడతాం.

-శంకరయ్య, బీజేపీ నాయకుడు

కర్నూలులో విలీనం సబబే

ఓర్వకల్లు మండలాన్ని కర్నూలు జిల్లాలోకి చేర్చడం సబబే. ఓర్వకల్లు నంద్యాల జిల్లాలోకి పోయివుంటే చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పటికే ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌ కావడంతో పలు పరిశ్రమలు వచ్చాయి. ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో కలపడం వల్ల ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది.

-చంద్రపెద్దస్వామి

కర్నూలులో కలపడం సంతోషం

పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలులో కలపడం సంతోషంగా ఉంది. కర్నూలు కార్పొరేషన్‌లో ఉంటూ ఏళ్ల తరబడి పన్నులు చెల్లిస్తూ 70 కి.మీ. ఉన్న నంద్యాలకు ఎలా వెళ్తాం? కర్నూలు జిల్లా కేంద్రంలో భాగమై 16 డివిజన్లు ఉన్న కల్లూరు అర్బన్‌, కల్లూరు మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చేది. కర్నూలులోని కల్లూరు ఎస్టేట్‌, ఓర్వకల్లులో ఇండస్ర్టియల్‌ సెక్టారు అన్నీ నంద్యాలకు వెళ్లిపోతే రెవెన్యూ కూడా కర్నూలు కోల్పోతుంది. కర్నూలుకు కేటాయించిన ఎయిర్‌పోర్టు కూడా నంద్యాలకు వెళ్లాల్సి వచ్చేది. పాణ్యం నియోజకవర్గం కర్నూలులో కలపడంతో విమానాశ్రయంతోపాటు కల్లూరు, ఓర్వకల్లు మండలాలతో పాటు ఇండస్ర్టియల్‌ హబ్‌, 16 కార్పొరేషన్ల డివిజన్ల రెవెన్యూ కూడా కర్నూలు జిల్లాకే చెందడం సంతోషించాల్సిన విషయం.  

-జి.చంద్రశేఖరప్ప, కల్లూరు

అశాస్త్రీయంగా నూతన జిల్లాలు

రాయలసీమ సాగునీటి సాధన సమితి

నంద్యాల టౌన్‌, జనవరి 27: రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా చేశారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. గురువారం నంద్యాలలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను దూరంగా ఉన్న నూతన జిల్లాలో చేర్చడం, నూతన జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతాలను పాత జిల్లాలోనే కొనసాగించడం సబబు కాదన్నారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి తోడ్పడేలా నూతన జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 40శాతం భూభాగం ఉన్న రాయలసీమలో కనీసం 10 నుంచి 11 జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ జిల్లాల్లో తాగు, సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ ప్రక్రియతో వలసలు శాశ్వతంగా ఆగిపోతాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో ఇప్పుడు ప్రకటించిన జిల్లాలకు అదనంగా ఆదోని, మదనపల్లె, గుంతకల్లు జిల్లాల ఏర్పాటు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జిల్లాల హద్దుల నిర్ణయంలో రాజకీయ ప్రయోజనాలు కాకుండా, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాల్సిందే

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఆర్‌సీసీ నాయకులు

ఆదోని(అగ్రికల్చర్‌), జనవరి 27: పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని రాయలసీమ కో ఆర్డినేషన్‌ కమిటీ, సీమ విద్యార్థి సంఘం, ఆదోని జిల్లా సాధన సమితి వేర్వేరుగా డిమాండ్‌ చేశాయి. బుధవారం రాయలసీమ కోఆర్డినేషన్‌ కమిటీ నాయకులు, సీమ విద్యార్థి సంఘం నాయకులు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్‌సీసీ రాష్ట్ర కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షుడు లోకేష్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ నియోజకవర్గాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని జిల్లాలను ఏర్పాటు చేస్తామనడం భావ్యం కాదన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన ఆదోనిని జిల్లాగా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ డిమాండ్‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇప్పటికే విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో పశ్చిమ ప్రాంతం వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆదోనిని కచ్చితంగా జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా ఏర్పాటుకు కృషి చేయకపోతే పశ్చిమ నియోజకవర్గాల్లో అధికార పార్టీ పతనం తప్పదని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయం తీసుకెళ్లి ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌ మేరకు ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని కోరతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు నవీన్‌కుమార్‌, మధు, తిరుమలేష్‌ పాల్గొన్నారు.

ఆదోని జిల్లా కోసం ఐక్యంగా పోరాడతామని జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసాచారి, న్యాయవాది మమతా లోకేష్‌, నాగరాజుగౌడ్‌, కోటి అన్నారు. వీరు బుధవారం భీమాస్‌లో సమావేశమై.. విద్యార్థి, యువజన, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు, న్యాయవాదులు, పారిశ్రామికవేత్తలను కలుపుకొని ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఆదోని ఏరియా అభివృద్ధి అథారిటీ వల్ల ప్రయోజనం లేదని, జిల్లాగా ఏర్పాటు చేయాలని, అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఆదోనిని పాలకులు విస్మరించారని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన కమిటీ కన్వీనర్‌ కోదండ డిమాండ్‌ చేశారు. గురువారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జిల్లా సాధన కమిటీ నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా కోదండ, కో కన్వీనర్‌గా రమేష్‌, గౌరవ సలహాదారుడిగా దస్తగిరినాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

డోన్‌ను కర్నూలులో కొనసాగించాలి

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన

డోన్‌, జనవరి 27: డోన్‌ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి, సుబ్బయ్య, బీఎస్‌పీ నాయకుడు విజయభాస్కర్‌, ఏబీవీపీ నాయకుడు హనుమంతు మాట్లాడుతూ డోన్‌ నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలో కలపడం అసంబద్ధంగా ఉందన్నారు. డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలం నుంచి నంద్యాలకు వెళ్లాలంటే 140 కి.మీ. ప్రయాణం చేయాలన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు జిల్లా కేంద్రానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే డోన్‌ నియోజకవర్గానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. డోన్‌ను కర్నూలు జిల్లాలో కొనసాగించే వరకు ఉద్యమం చేపడుతామని వారు ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివశంకర్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు సుదర్శన్‌, బీజేవైఎం నాయకులు రామచంద్రుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T06:21:08+05:30 IST