పరీక్షలు సాధ్యమేనా?

ABN , First Publish Date - 2021-04-21T05:12:55+05:30 IST

కరోనా కేసులు విజృంభిస్తుండడంతో పది, ఇంటర్‌, డిగ్రీ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. ఒక పక్క షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు సాధ్యమేనా? అన్న సందేహం వారిలో వ్యక్తమవుతోంది.

పరీక్షలు సాధ్యమేనా?

కొవిడ్‌తో పది, ఇంటర్‌, డిగ్రీ పరీక్షల నిర్వహణపై అయోమయం
 ఆందోళనలో విద్యార్థులు, తలిదండ్రులు
 షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామన్న ప్రభుత్వం
గుజరాతీపేట, ఏప్రిల్‌ 20:
కరోనా కేసులు విజృంభిస్తుండడంతో పది, ఇంటర్‌, డిగ్రీ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. ఒక పక్క షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు సాధ్యమేనా? అన్న సందేహం వారిలో  వ్యక్తమవుతోంది.  జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 37,879 మంది ఉన్నారు. జూన్‌ 21 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు విడుదలైంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 30,841 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 29,744 మంది, ప్రైవేటుగా మరో 1,071 మంది పరీక్షలు రాసేందుకు ఫీజును చెల్లించారు. మే 5 నుంచి ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 113  కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గత నెలలో ప్రారంభమైన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు కూడా ఈ నెల 24తో పూర్తి కానున్నాయి. డిగ్రీ ప్రథమ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. గడిచిన మార్చిలో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పది, ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయా? లేదా? అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కరోనా కారణంగా ప్రభుత్వం పలుమార్లు వాయిదా వేసింది. కొవిడ్‌ కేసులు భారీగా పెరగడంతో చివరి నిమిషంలో పూర్తిగా పరీక్షలను రద్దు చేసింది. ఈ ఏడాది మాత్రం పది పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే  జరుగుతాయని ఈ నెల 19న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కుదరడం లేదు. గతేడాది మాదిరిగా చివరి నిమిషంలో పరీక్షలు రద్దవుతాయని భావిస్తున్నారు. ఇక ఇంటర్‌ పరీక్షలపై కూడా ఇదే సందిగ్ధం నెలకొంది. డిగ్రీ పరీక్షల విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రఽథమ డిగ్రీ ప్రవేశాలు ఆన్‌లైన్‌లో జరగడంతో విద్యార్థుల డేటా అంతా సెంట్రలైజ్డ్‌గా సిద్ధంగా ఉంది. కనుక ఆన్‌లైన్‌లో సెంట్రలైజ్డ్‌గా డిగ్రీ ప్రథమ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తు న్నట్టు తెలుస్తోంది. డిగ్రీకి సంబంధించి ఎటువంటి కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక్కో బెంచికి ఐదుగురు చొప్పున విద్యార్థులు కూర్చోవాల్సి వస్తోంది. దీంతో ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు ఈ నెల 22 నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేందుకు శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీరాములు నిర్ణయించారు.  ప్రథమ సంవత్సరం విద్యార్థులకు భౌతిక దూరం పాటిస్తూ  పాఠాలు చెప్పేందుకు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2021-04-21T05:12:55+05:30 IST