రాజకీయం.. రసవత్తరం

ABN , First Publish Date - 2022-07-01T17:06:41+05:30 IST

మహానగర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నగరంలో విజయ సంకల్పన సభ జరగనున్న కీలక సమయంలో బీజేపీకి ఊహించని

రాజకీయం.. రసవత్తరం

కార్పొరేటర్ల జంప్‌తో కాషాయంలో కలకలం.. 

కౌన్సిల్‌లో తగ్గనున్న బలం


హైదరాబాద్‌ సిటీ: మహానగర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నగరంలో విజయ సంకల్పన సభ జరగనున్న కీలక సమయంలో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు గురువారం గులాబీ గూటికి చేరుకున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాషాయ పార్టీ నేతల మనోస్థైర్యాన్ని దెబ్బకొట్టాలన్న టీఆర్‌ఎస్‌ వ్యూహం ప్రాథమికంగా ఫలించింది. అగ్రనేతల రాక నేపథ్యంలో ఆ పార్టీకి ఇదిమింగుడుపడని విషయమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. చేరికలు కొనసాగుతాయని, మున్ముందు మరిన్ని ఊహించని పరిణామాలు జరుగుతాయని గులాబీ నాయకులు చెబుతున్నారు. తాజా చేరికలతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో టీఆర్‌ఎస్‌ బలం పెరిగింది. ప్రస్తుతం అధికార పార్టీకి 56 మంది కార్పొరేటర్లు ఉండగా బీజేపీ నుంచి నలుగురు చేరిన నేపథ్యంలో ఆ సంఖ్య 60కి పెరగనుంది. అదే సమయంలో 47మంది సభ్యులున్న బీజేపీ బలం 43కు తగ్గింది.  


పార్టీలో ఇబ్బందులు.. పర్సనల్‌ సమస్యలు

కార్పొరేటర్లు వెల్డండ వెంకటేష్‌, అర్చన జయప్రకాష్‌, బానోతు సుజాత నాయక్‌, సునీతా ప్రకా్‌షగౌడ్‌లో కారెక్కడానికి అధికార పార్టీ ఆఫర్లతోపాటు స్థానికంగా పార్టీ పరమైన ఇబ్బందులూ కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖైరతాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, వెంకటేష్‌ మధ్య దూరం పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఆలయ స్థల వివాదంలో వీరిరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయని సమాచారం. సుజాతనాయక్‌కు హస్తినాపురం బీజేపీ డివిజన్‌ కమిటీతో విభేదాలున్నాయి. సమస్యలపై ఫిర్యాదు చేసినా పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టించుకోకపోవడం, పార్టీ వాట్సాప్‌ గ్రూపుల నుంచి కొంతకాలం క్రితం తొలగించడం, సమావేశాలకు పిలవకపోవడంతో మనస్థాపం చెందారని చెబుతున్నారు. సునీతా ప్రకా్‌షగౌడ్‌ కూడా పార్టీలో ప్రాధాన్యం లభించడం లేదన్న నిరాశతో ఉన్నారు.

అర్చన జయప్రకాష్‌ ఎన్నికల ముందు వరకు టీఆర్‌ఎ్‌సలో ఉన్నారు. బీజేపీ అవకాశం ఇవ్వడంతో ఆ పార్టీలో చేరారు. పార్టీ నేతల ఒత్తిళ్లు, మాకు తెలియకుండా ఏం చేయవద్దనే హుకుం జారీ చేయడంపై అర్చన పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా.. అర్చన జయప్రకాష్‌ దిష్టిబొమ్మను శివరాంపల్లిలో బీజేపీ శ్రేణులు దహనం చేశాయి. సునీతా ప్రకా్‌షగౌడ్‌ రాజీనామా చేయాలని రాంనగర్‌లో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. 

Updated Date - 2022-07-01T17:06:41+05:30 IST