రాజధానిలో రాజకీయ వేడి

ABN , First Publish Date - 2022-07-06T17:53:37+05:30 IST

మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరుపై మహేశ్వరంలో మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి బాహాటంగానే విమర్శలు చేశారు. ఉప్పల్‌ నియోజకవర్గంలో

రాజధానిలో రాజకీయ వేడి

 టీఆర్‌ఎస్‌లో మాజీ మేయర్ల కలకలం

 ఉప్పల్‌లో బొంతు రామ్మోహన్‌ అలజడి

 మహేశ్వరంలో సబితారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి విమర్శలు

 ఒకే రోజు జరిగిన ఉదంతాలతో కారులో ‘కుదుపులు’

 కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా అక్కాతమ్ముళ్లు


మహా నగరంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, టీఆర్‌ఎస్‌ ర్యాలీలతో మొదలైన హీట్‌ వేర్వేరు రూపాల్లో కొనసాగుతోంది. సొంత పార్టీల్లోనే ఆధిపత్య, అసమ్మతి పోరు టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చేరికలపై దృష్టి సారించిన అన్ని పార్టీలూ వీటిపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి. అసంతృప్తులను లాక్కునే పనిలో పడ్డాయి. 


హైదరాబాద్‌ సిటీ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరుపై మహేశ్వరంలో మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి బాహాటంగానే విమర్శలు చేశారు. ఉప్పల్‌ నియోజకవర్గంలో బొంతు రామ్మోహన్‌ బలప్రదర్శన అధికార పార్టీలో అసమ్మతి, అసంతృప్త వైఖరులను బహిర్గతం చేసింది. మరోవైపు కాంగ్రెస్‌లో పీజేఆర్‌ తనయ, తనయుడి తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జూబ్లీహిల్స్‌ నుంచి పోటీచేసిన విష్ణువర్ధన్‌రెడ్డి, ఇటీవల కాంగ్రె్‌సలో చేరిన అక్క మధ్య విభేదాలపై భిన్న ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలపై నగరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. 


టీఆర్‌ఎస్‎లో అలజడి

మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జన్మదిన వేడుకలు టీఆర్‌ఎ్‌సలో అలజడి రేపాయి. పుట్టినరోజు సందర్భంగా అధికార పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి సన్నిధి వరకు చేపట్టిన భారీ ర్యాలీ నియోజకవర్గ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది బలప్రదర్శనే అన్న చర్చ మొదలైంది. బొంతు రామ్మోహన్‌ చర్లపల్లి నుంచి కార్పొరేటర్‌గా గెలిచి 2016 నుంచి 2021 వరకు మేయర్‌గా పని చేశారు. రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడంతోపాటు కార్పొరేటర్ల మద్దతుతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అధిష్ఠానం ఆయనకు అవకాశం ఇవ్వకుండా.. భేతి సుభా్‌షరెడ్డిని బరిలో నిలిపింది. అప్పటి నుంచి ఇరువురి మధ్య దూరం పెరిగింది. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్‌ నుంచి భార్య బొంతు శ్రీదేవిని బరిలో నిలిపి గెలిపించుకున్నారు.

తద్వారా నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పటికీ రామ్మోహన్‌ ఉప్పల్‌ అసెంబ్లీ టికెట్‌పై ఆశలు వదులుకోలేదు.ఎమ్మెల్యేను విభేదించిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా మంగళవారం జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఉప్పల్‌ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ర్యాలీగా యాదాద్రి వెళ్లారు. నలుగురు కార్పొరేటర్లు, నలుగురు మాజీ కార్పొరేటర్లు ఆయనతో ఉన్నారు. తన బల ప్రదర్శన కోసమే బొంతు ఇలా చేశారన్న ప్రచారం జరుగుతోంది. 

విందుతో వదంతులు

నగర వాసులకు దివంగత పీజేఆర్‌ అభిమాన నాయకుడు. ఇప్పటికీ ఆయనకు అభిమానులు ఉన్నారు.  ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి బోనాల పండగ నేపథ్యంలో స్వగృహంలో ఏర్పాటు చేసిన విందు రాజకీయంగా కాంగ్రెస్‌లో దుమారం రేపింది. సాధారణ ధోరణిలో సీనియర్‌ నేతలను ఆహ్వానించినప్పటికీ.. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి తెరపైకి రావడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ జోరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించినా విష్ణు ఎక్కడా కనిపించలేదు. పార్టీ రచ్చబండ పేరుతో నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా జూబ్లీహిల్స్‌లో ఆ పరిస్థితి లేదు. కానీ ఇటీవల విష్ణువర్ధన్‌రెడ్డి సోదరి, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కితో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను విష్ణు కలిశారు. విజయారెడ్డిని కాంగ్రె్‌సలో చేర్చుకోవడం విష్ణుకు ఇష్టం లేదని, ఆ విషయంపై చర్చించేందుకే విష్ణు భట్టిని కలిశారనే వాదన వినిపించింది. 


ఇదిలా ఉండగా.. మంగళవారం విష్ణు నివాసానికి భట్టి, మధుయాష్కితోపాటు పలువురు కాంగ్రెస్‌ ప్రముఖులు విందుకు వచ్చారు. దీంతో ఆ వాదన బలపడింది. విష్ణు కాంగ్రె్‌సకు గుడ్‌ బై చెప్పనున్నారని వార్తలు వచ్చాయి. విజయారెడ్డిని కాంగ్రె్‌సలో చేర్చుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విష్ణు, ఇతరుల అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్‌ నేతలు మీడియా ముందుకు వచ్చి విష్ణు కాంగ్రె్‌సలోనే ఉంటారని, అదంతా ప్రచారమే అని వెల్లడించారు. కానీ.. మంగళవారం సాయంత్రం వరకూ జరిగిన పరిణామాలు కాంగ్రె్‌సలో తీవ్ర చర్చకు దారి తీశాయి. 


 పార్టీ లైన్‌ దాటుతున్న ముఖ్యనేతలు 

మంత్రి సబితారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేకెత్తించాయి. సబితారెడ్డి ప్రోత్సాహంతో కబ్జాలు జరుగుతున్నాయని, ఆమె వైఖరి కారణంగానే బడంగ్‌పేట మేయర్‌ పారిజాతారెడ్డి టీఆర్‌ఎ్‌సను వీడారని ఆరోపించారు. తీగల వ్యాఖ్యలపై మంత్రి సబితారెడ్డి కూడా అదే స్థాయిలో స్పందించారు. ఆయనను ఎవరో మిస్‌గైడ్‌ చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. తీగల కృష్ణారెడ్డితోపాటు కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కూడా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకపోతే ఆశావహులు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు పార్టీ లైన్‌ దాటి వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా టీర్‌ఎ్‌సలో అసంతృప్తిగా ఉన్న నేతలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విశ్వసనీయ సమాచారం. 

Updated Date - 2022-07-06T17:53:37+05:30 IST