ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల్లో అయోమయం?

ABN , First Publish Date - 2022-08-08T06:57:42+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ(ఆర్‌జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి, ఆర్‌జీయూకేటీ ఇంకా నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో విద్యార్థుల్లో సందిగ్ధత నెలకొంది.

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల్లో అయోమయం?

కోర్సుల్లో ప్రవేశాలకు ఇంకా విడుదల కాని నోటిఫికేషన్‌

చివరి దశలో ఇంటర్‌, పాలిటెక్నిక్‌  అడ్మిషన్లు

విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ సందిగ్ధత

నూజివీడు టౌన్‌, ఆగస్టు 7: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ(ఆర్‌జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి, ఆర్‌జీయూకేటీ ఇంకా నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో విద్యార్థుల్లో సందిగ్ధత నెలకొంది. గత రెండు విద్యా సంవత్సరాల్లో కొవిడ్‌ ప్రభావం మూలంగా పదోతరగతి పరీక్షలు నిర్వహించక పోవడంతో ట్రిపుల్‌ ఐటీ  పాలిటెక్నిక్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆర్‌జీయూకేటీ కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించింది. అందులో ర్యాంకులు సాధించిన వారికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు కల్పించగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించేందుకు ఆర్‌జీయూకేటీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం పదోతరగతి పరీక్షల్లో తప్పిన వారికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తూ, వాటిని సప్లిమెంటరీగా భావించకుండా బెటర్‌మెంట్‌గా భావించాలని పేర్కొనడంతో ఆర్‌జీయూకేటీ పదోతరగతి బెటర్‌మెంట్‌ పరీక్షల అనంతరం నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు ప్రథమార్థ్ధంలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆర్‌జీయూకేటీ ఉన్నతాధికారులు గతనెలలో పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఆగస్టు మొదటి వారం పూర్తి అయినా, ఇంకా నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడంపై ట్రిపుల్‌ ఐటీ ఆశావహ విద్యార్థుల్లో సందిగ్ధత నెలకొంది. మరోవైపు పదోతరగతి ఫలితాలు విడుదలై నెల పూర్తవుతుండగా, ఇంటర్‌, పాలిటెక్నిక్‌ తదితర కోర్సుల అడ్మిషన్లు చివరి దశలో వున్నాయి. ఈ నేపఽథ్యంలో ట్రిపుల్‌ ఐటీ ఆశావహ విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూడాలా ? లేక ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందాలా? అనే అయోమయం నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పది మార్కుల ఆధారంగానే


ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు చేసిన తొలినాళ్ల నుంచి అడ్మిషన్ల ప్రక్రియకు పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వ  పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు 0.4 శాతం పాయిం ట్లను విద్యార్థులకు వచ్చిన జీపీఏకు చేర్చి ప్రవేశాలను కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ ప్రభావంతో పదోతరగతి పరీక్షలు నిర్వహించకపోవడంతో పాలిసెట్‌తో కలిసి ఆర్‌జీయూకేటీ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించి వచ్చిన ర్యాంకు ఆధారంగా అడ్మిషన్‌లు కొనసాగించింది. ప్రస్తుతం పాత విధానాన్నే అమలు పరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల్లో జాప్యం వల్ల అడ్మిషన్‌ల నోటిఫికేషన్‌ విడుదల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.


ప్రతిభకు పాతర


ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాలకు సంబంధించి ప్రస్తుత విద్యాసంవత్సరంలో అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రధాన మూల ఉద్దేశాన్ని దెబ్బతీసేలా ఉందని, ట్రిపుల్‌ ఐటీ ఆశావహ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశం కల్పించి సాంకేతిక విద్యను అందించాలనేది ఆర్‌జీయూకేటీ ఉద్దేశం. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి తప్పిన విద్యార్థులను ప్రత్యేకంగా బెటర్‌మెంట్‌ విద్యార్థులుగా గుర్తిస్తూ వారికి ప్రవేశాలు కల్పించాలని చూడటం ప్రతిభగల విద్యార్థులను దెబ్బతీయటమేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 2008లో వైఎస్‌ హయాంలో ప్రారంభం


గ్రామీణప్రాంత విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో 2008లో నాటి ముఖ్య మంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు, ఆర్కే వ్యాలీ, బాసరలలో ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేశారు. తొలుత ప్రతి ట్రిపుల్‌ ఐటీలోనూ 2 వేల సీట్లను ఏర్పాటు చేయగా తదనంతర కాలంలో రోశయ్య ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ట్రిపుల్‌ ఐటీ సీట్లను వెయ్యికి కుదించారు. రాష్ట్రవిభజన అనంతరం బాసర ట్రిపుల్‌ ఐటీ తెలంగాణకు వెళ్లిపోగా, ఆంధ్రప్రదేశ్‌లో నూజివీడు, ఆర్కేవ్యాలీలు మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ ఐటీల సీట్లను తిరిగి రెన్యువల్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ రావడంతో అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నూజివీడు ఆర్కేవ్యాలీలకు అదనంగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటుచేసి, మౌలిక సదుపాయాల కల్పన జరిగే వరకు నూజివీడు, ఆర్కే వ్యాలీల్లో తాత్కాలికంగా తరగతులు నడిపేందుకు చర్యలు చేపట్టింది.


Updated Date - 2022-08-08T06:57:42+05:30 IST