బైడెన్, కమలాకు ప్రధాని మోదీ అభినందనలు

ABN , First Publish Date - 2020-11-08T14:13:21+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠ పోరులో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. దీంతో తదుపరి అగ్రరాజ్యాధిపతి ఎవరనే విషయమై యావత్ ప్రపంచం ఎదురుచూపులకు తెర పడింది.

బైడెన్, కమలాకు ప్రధాని మోదీ అభినందనలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠ పోరులో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. దీంతో తదుపరి అగ్రరాజ్యాధిపతి ఎవరనే విషయమై యావత్ ప్రపంచం ఎదురుచూపులకు తెర పడింది. డొనాల్డ్ ట్రంప్‌పై 77ఏళ్ల బైడెన్ విజయం సాధించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 290 ఎలక్టోరల్ ఓట్లను పొందిన బైడెన్.. అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ దేశాధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా బైడెన్‌కు కంగ్రాట్స్ చెప్పారు. "అద్భుత విజయం సాధించిన బైడెన్‌కు శుభాకాంక్షలు. ఉపాధ్యక్షుడిగా యూఎస్-ఇండియా సంబంధాల కోసం మీ సహకారం అమూల్యమైనది. ఇండో-యూఎస్ సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నా" అని మోదీ ట్వీట్ చేశారు. అలాగే బైడెన్‌తో కరచాలనం చేస్తున్న ఓ ఫొటోను కూడా ఈ ట్వీట్‌కు మోదీ జతచేశారు. 


ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలిగా గెలిచిన భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్‌కు కూడా మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు."అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన కమలా హ్యారిస్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ విజయం చరిత్రాత్మకం. ఇది మీకే కాకుండా భారతీయ అమెరిక్లనందరికీ గర్వకారణం. మీ మద్దతు మరియు నాయకత్వంతో శక్తివంతమైన ఇండో-యూఎస్ సంబంధాలు మరింత బలపడతాయని నా నమ్మకం" అని మోదీ పేర్కొన్నారు. 






అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా బైడెన్, కమలాకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. "అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు శుభాకాంక్షలు. మీ నాయకత్వ మార్గంలో అమెరికా మరింత అభివృద్ధిని సాధిస్తుందని నేను నమ్ముతున్నాను." అని అన్నారు. ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించిన కమలాకు శుభాకాంక్షలు తెలియజేసిన రాహుల్... "అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా గెలిచిన కమలా హ్యారిస్‌కు అభినందనలు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేయబోతున్న మొదటి మహిళకు భారతదేశంలో మూలాలు ఉండడం మాకు గర్వకారణం." అని ట్వీట్ చేశారు. 





Updated Date - 2020-11-08T14:13:21+05:30 IST