గాంధీ కుటుంబాన్ని తప్ప బయట ఏముందో కాంగ్రెస్ చూడదు : కేంద్ర మంత్రి ఠాకూర్

ABN , First Publish Date - 2022-04-05T18:03:42+05:30 IST

కాంగ్రెస్ కేవలం గాంధీ కుటుంబాన్ని మాత్రమే చూస్తుందని,

గాంధీ కుటుంబాన్ని తప్ప బయట ఏముందో కాంగ్రెస్ చూడదు : కేంద్ర మంత్రి ఠాకూర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ కేవలం గాంధీ కుటుంబాన్ని మాత్రమే చూస్తుందని, ఆ కుటుంబం తప్ప బయట ఏముందో ఆ పార్టీ చూడదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో థాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ పునరుజ్జీవం పొందడం కేవలం తమ కోసం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి, సమాజానికి ముఖ్యమని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటోందని, భయాందోళనలను వ్యాపింపజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు మునుపటి కన్నా సవాళ్ళతో కూడినదని చెప్పారు. ‘‘మన అంకితభావం, దృఢ సంకల్పం, తట్టుకుని నిలబడగలిగే సత్తా కఠిన పరీక్షకు నిలుస్తున్నాయి. మన విశాలమైన సంస్థలో అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా ముఖ్యం’’ అని తెలిపారు. ఐకమత్యాన్ని సాధించడం కోసం ఏం చేయడానికైనా తాను నిశ్చయించుకున్నానని చెప్పారు. 


అనురాగ్ ఠాకూర్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సోనియా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం గాంధీ కుటుంబాన్ని మాత్రమే చూస్తుందన్నారు. ఆ కుటుంబాన్ని తప్ప, దానికి బయట ఏముందో ఆ పార్టీ చూడదన్నారు. ఆ కుటుంబంలోని సభ్యులంతా తమ ప్రయత్నాల ఫలితాలను ఇప్పటికే చూశారన్నారు. గతంలో రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టినపుడు పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయిందన్నారు. అదేవిధంగా ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారని, ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయి, కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలవగలిగిందని చెప్పారు. ఇప్పుడు సోనియా గాంధీ బాధ్యతను నిర్వహిస్తున్నారన్నారు. శక్తి, సామర్థ్యాలతో పని లేకుండా ఒక కుటుంబానికి మాత్రమే నాయకత్వ పదవులు పరిమితమా? అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తోందన్నారు. ఈ పజిల్‌కు సమాధానాన్ని కాంగ్రెస్ కనుగొనే వరకు సంక్షోభం నుంచి బయటపడే మార్గం ఆ పార్టీకి కనిపించదని చెప్పారు. 


ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోగా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, వంశపారంపర్య, కుటుంబ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. 


Updated Date - 2022-04-05T18:03:42+05:30 IST