ఓరుగల్లుకు టీఆర్‌ఎస్‌ చేసిందేమిటీ?

ABN , First Publish Date - 2021-02-25T04:42:39+05:30 IST

ఓరుగల్లుకు టీఆర్‌ఎస్‌ చేసిందేమిటీ?

ఓరుగల్లుకు టీఆర్‌ఎస్‌ చేసిందేమిటీ?
మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పక్కన ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌

ఎయిర్‌పోర్టు, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏమైంది?

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులు శూన్యం

కోచ్‌, ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఊసేలేదు..

పల్లా.. కేసీఆర్‌ చెంచా.. రాముడిపేరుతో బీజేపీ రాజకీయం

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ధ్వజం


వరంగల్‌ సిటీ, ఫిబ్రవరి 24 : వరంగల్‌ నగరాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ చేసింది శూన్యమమని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్‌ కా ర్యాలయంలో పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సభావత్‌ రాములు నా యక్‌ పరిచయ సమావేశం జరిగింది. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉత్తమ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మామునూర్‌ ఎయిర్‌పోర్టు, నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైయినేజీ ఏర్పాటుపై కేసీఆర్‌ సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంజీఎం ఆస్పత్రిని నిర్వీర్యం చేశాడన్నారు. రాష్ట్రానికి, వరంగల్‌కు కేంద్రం తెచ్చిన ప్రాజెక్టులేమిటని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, భువనగిరిలో మెడికల్‌ అండ్‌ సైన్స్‌ సెంటర్‌, హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ఏర్పాటయ్యాయా అని ప్రశ్నించారు. 


నిరుద్యోగులు దగా

లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ కేసీఆర్‌ నమ్మించి నమ్మక ద్రోహం చేశాడన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర  పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రేక్షకపాత్రకు పరిమితమైందన్నారు. ఫిట్‌మెంట్‌ పేరుతో ఉద్యోగులను సీఎం కేసీఆర్‌ ఆపహాస్యం చేశాడని మండిపడ్డారు. ల్యాండ్‌, మైన్స్‌, వైన్స్‌ మాఫియా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి అక్రమాలను ప్రొత్సహిస్తుందని ఆరోపించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు బుద్ది చెప్పాలని కోరారు. 


పల్లా చెంచా

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ చెంచా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గులాంగిరి చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టి అక్రమంగా సంపాదించాడన్నారు. ఆరేళ్లలో ఎమ్మెల్సీగా రాజేశ్వర్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడన్నారు. బీజేపీ వాళ్ళు రాముడి పేరిట రాష్ట్రంలో రాద్ధాంతం చేస్తున్నారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం మత చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఆయోధ్య రామమందిరం నిర్మాణాన్ని కోరుకుంటున్నాం కానీ రాజకీయం చేయడమే అభ్యంతరకరమన్నారు. భద్రాద్రి రామాలయం అభివృద్ధిని బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం ఇతర సభ్యుల్లో అగ్రవర్ణాల వారే ఉన్నారన్నారు. గిరిజన అభ్యర్థి రాములు నాయక్‌ను గెలిపించాలని కోరారు. 


పల్లా ఉద్యమ జెండా మోసిండా: జీవన్‌రెడ్డి 

పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ జెండా మోసినోడేనా అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌ మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితితో ఏం సంబంఽధమని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే యూనివర్సీటీల అభివృద్ధి, అధ్యాపకుల సమస్యల పరిష్కారం. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతానన్నారు. ఈ సమావేశంలో కత్తి వెంకటస్వామి, కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ, కొండా మురళీధర్‌రావు, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మీసాల ప్రకాశ్‌, నమిండ్ల శ్రీనివాస్‌, సిరిసిల్ల రాజయ్య, అయూబ్‌ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:42:39+05:30 IST