పెట్రోలుపై వ్యాట్ తగ్గించాలన్న మోదీపై కాంగ్రెస్ గరంగరం

ABN , First Publish Date - 2022-04-27T22:18:18+05:30 IST

పెట్రోలు, డీజిల్‌లపై వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్)ను తగ్గించాలని

పెట్రోలుపై వ్యాట్ తగ్గించాలన్న మోదీపై కాంగ్రెస్ గరంగరం

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్‌లపై వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్)ను తగ్గించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరడంపై కాంగ్రెస్, శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరంతరం వీటి ధరలను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.26 లక్షల కోట్లు ఆర్జించిందని చెప్తూ, కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని మరింత తగ్గించాలని డిమాండ్ చేశాయి. 


కాంగ్రెస్ నేత పవన్ ఖేరా బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఆయన (మోదీ-కేంద్ర ప్రభుత్వం) పెట్రోలు, డీజిల్‌లపై సెంట్రల్ ఎక్సయిజ్ సుంకం ద్వారా రూ.26 లక్షల కోట్లు సంపాదించారన్నారు. దానిని పంపిణీ చేశారా? అని ప్రశ్నించారు. జీఎస్‌టీ వాటాను రాష్ట్రాలకు సకాలంలో ఇవ్వడం లేదని, రాష్ట్రాలను వ్యాట్ తగ్గించుకోవాలని అడుగుతున్నారని అన్నారు. ఆయన (మోదీ) ముందు కేంద్ర ఎక్సయిజ్ డ్యూటీని తగ్గించాలని, ఆ తర్వాత వ్యాట్ తగ్గించాలని ఇతరులను కోరాలని డిమాండ్ చేశారు. 


కాంగ్రెస్ నేత దీపేందర్ ఎస్ హుడా మీడియాతో మాట్లాడుతూ, పెట్రోలు ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తప్పించుకుంటోందన్నారు. బీజేపీ పరిపాలిస్తున్న హర్యానాలో పెట్రోలు, డీజిల్‌లపై అత్యధిక వ్యాట్ ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధనం ధరలు పెరిగినపుడు మన దేశంలో కూడా వాటి ధరలను పెంచుతున్నారని, అయితే అంతర్జాతీయంగా గోధుమల ధరలు పెరిగినపుడు మాత్రం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని పెంచడం లేదని ఆరోపించారు. 


శివసేన అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, కోవిడ్ మహమ్మారిపై ఏర్పాటు చేసిన సమావేశాన్ని రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారా? అని నిలదీశారు. పెట్రోలు, డీజిల్‌లపై సెంట్రల్ ఎక్సయిజ్ డ్యూటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.26 లక్షల కోట్లు ఆర్జించిందన్నారు. ఇంధనం ధరలు అతి తక్కువకు క్షీణించినపుడు సైతం వీటి ధరలను 18 సార్లు పెంచిందన్నారు. జీఎస్‌టీ వాటాను, జీఎస్‌టీ నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు ఇవ్వలేదని, ఇప్పుడు వేళ్లు చూపిస్తున్నారని మండిపడ్డారు. 


దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలు, డీజిల్‌ ధరల గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం గత నవంబరులో ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్‌ను తగ్గించుకుని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని కోరారు. 


Updated Date - 2022-04-27T22:18:18+05:30 IST