అద్దె చెల్లించని కాంగ్రెస్, సోనియా

ABN , First Publish Date - 2022-02-10T22:52:08+05:30 IST

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంతోపాటు, ఆ పార్టీ

అద్దె చెల్లించని కాంగ్రెస్, సోనియా

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంతోపాటు, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి అద్దె సక్రమంగా చెల్లించడం లేదని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. సుజిత్ పటేల్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తుకు సమాధానంగా ఈ వివరాలను తెలిపింది. 


న్యూఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం అద్దె బాకీ రూ.12,69,902 అని తెలిపింది. 2012 డిసెంబరులో చివరిసారి ఈ సముదాయానికి అద్దె చెల్లించినట్లు పేర్కొంది. న్యూఢిల్లీలోని 10, జన్‌పథ్‌ రోడ్డులో ఉన్న సోనియా గాంధీ నివాసం అద్దె బాకీ  రూ.4,610 అని తెలిపింది. ఈ నివాసం అద్దె చివరిసారి 2020 సెప్టెంబరులో చెల్లించారని పేర్కొంది. 


సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జి నెం.C-11/109, చాణక్యపురిలో నివసిస్తున్నారని, ఈ భవనం అద్దెను చివరిసారి 2013 ఆగస్టులో చెల్లించారని, ప్రస్తుతం బాకీ రూ.5,07,911 అని వివరించింది. 


హౌసింగ్ రూల్స్ ప్రకారం జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు మూడేళ్ళలోగా సొంతంగా కార్యాలయాలను నిర్మించుకోవలసి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం కల్పించిన వసతిని ఖాళీ చేయవలసి ఉంటుంది. 


9-A రౌజ్ ఎవెన్యూలో 2010 జూన్‌లో కాంగ్రెస్ పార్టీకి భూమిని ఇచ్చారు. ఆ పార్టీ నేతలు 2013నాటికి అక్బర్ రోడ్డులోని కార్యాలయాన్ని, మరికొన్ని బంగళాలను ఖాళీ చేయవలసి ఉంది. కానీ ఆ పార్టీ అనేకసార్లు పొడిగింపులను కోరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లోఢీ రోడ్డులో నివసిస్తుండగా, ఆ బంగళాను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని ప్రభుత్వం 2020 జూలైలో నోటీసు ఇచ్చింది. 


Updated Date - 2022-02-10T22:52:08+05:30 IST