పాత పాఠాలే కావాలి

ABN , First Publish Date - 2022-06-10T17:35:12+05:30 IST

విద్యార్థుల మనసులను కలుషితం చేసేందుకు సంఘ్‌ పరివార్‌ భావజాలాన్ని జొప్పించేందుకు జరుగుతున్న కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేపీసీసీ

పాత పాఠాలే కావాలి

- సచివాలయం వద్ద కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల నిరసన 

- సీఎం రాజీనామాకు డిమాండ్‌


బెంగళూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల మనసులను కలుషితం చేసేందుకు సంఘ్‌ పరివార్‌ భావజాలాన్ని జొప్పించేందుకు జరుగుతున్న కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య ప్రకటించారు. పాఠ్యాంశాలలో మార్పులకు నిరసనగా సచివాలయం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో మౌన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బసవణ్ణను అవమానించేలా పాఠ్యాంశాలను మార్పులు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందన్నారు. భగత్‌సింగ్‌, రాణి అబ్బక్క పాఠాలు తొలగించి హెగ్డేవార్‌, వీరసావర్కర్‌, సూలిబెలె పాఠాలు చేర్చడం వెనుక బీజేపీ ప్రభుత్వ లక్ష్యం ఏమిటో అందరికీ తెలుస్తోందన్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి వివాదాలు సంభవించలేదన్నారు. ఆర్‌ఎస్ఎస్‌, సంఘ్‌ పరివార్‌ చేతిలో ముఖ్యమంత్రి బొమ్మై కీలుబొమ్మగా మారి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ నిర్ణయాల కారణంగానే శాంతి, సామరస్యం దెబ్బతింటున్నాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని అధ్వాన్నంగా మార్చిన సీఎం తక్షణం రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.


అధికార బీజేపీలోనూ అసంతృప్తి సెగ 

పాఠ్యాంశాలలో మార్పులు చేర్పుల అంశంపై అధికార బీజేపీలోనూ అసంతృప్తి సెగలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ నిర్మాత అనే పదాన్ని తొలగించడంపై బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్‌, నంజనగూడు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ ఆక్రోశం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే తాజాగా మూడిగెరె ఎమ్మెల్యే కుమారస్వామి కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జరిగిన తప్పును తక్షణం సరిదిద్దాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరోవైపు 6వ తరగతి సమాజశాస్త్రంలో సురపుర రాజా వెంకటప్ప నాయక్‌కు చెందిన ఫొటోలు, కథనాలు తీసివేయడంపై బీజేపీ ఎమ్మెల్యే, జలమండలి అధ్యక్షుడు రాజుగౌడ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠ్యాంశాలలో ఒకవేళ లోటుపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుతామని మంత్రి బీసీ నాగేశ్‌ బెంగళూరులో గురువారం మీడియాకు వెల్లడించారు. పాఠ్యాంశాలలో కొత్త అంశాలు చేర్చే సమయంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట నిజమేనన్నారు. వీటిని సరిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. 


Updated Date - 2022-06-10T17:35:12+05:30 IST