Cheetah credit war : 2009నాటి లేఖతో మోదీపై కాంగ్రెస్ దాడి

ABN , First Publish Date - 2022-09-18T19:35:50+05:30 IST

అంతరించిపోయిన చిరుత పులుల పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు నిర్మాణాత్మక

Cheetah credit war : 2009నాటి లేఖతో మోదీపై కాంగ్రెస్ దాడి

న్యూఢిల్లీ : అంతరించిపోయిన చిరుత పులుల పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు నిర్మాణాత్మక కృషి చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ (Congress) గట్టిగా గళమెత్తింది. ప్రాజెక్టు చీతా గురించి వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (Wildlife Trust of India)కు 2009లో యూపీఏ ప్రభుత్వం (UPA Government)  రాసిన లేఖను బయటపెట్టింది. 


ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆదివారం ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో జైరామ్ రమేశ్ పర్యావరణం, అడవుల శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. 


‘‘మన ప్రధాన మంత్రి అబద్ధాలకోరు. భారత్ జోడో యాత్రలో ఉండటం వల్ల నిన్న (శనివారం) ఈ లేఖ గురించి చెప్పలేకపోయాను’’ అని జైరామ్ రమేశ్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తోపాటు 2009నాటి లేఖను కూడా జత చేశారు. ప్రాజెక్ట్ చీతాకు నాంది ఈ లేఖ అని తెలిపారు.


ప్రాజెక్టు చీతాకు పచ్చ జెండా ఊపుతూ అప్పట్లో వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖ ఇది. చిరుత పులులను తిరిగి తీసుకురావడం కోసం సవివరమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఈ ట్రస్ట్ అధికారి డాక్టర్ ఎంకే రంజిత్ సింహ్‌ను ఈ లేఖలో కోరారు. వీటిని పెంచడానికి తగిన ప్రదేశాలను కూడా తెలియజేయాలని కోరారు. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బీఎన్‌హెచ్ఎస్, డబ్ల్యూటీఐ వంటి సంస్థలతో సమన్వయం కుదుర్చుకుని చిరుత పులుల పునరుద్ధరణపై విశ్లేషణ జరపాలని కోరారు. ఈ అధ్యయనంలో రాష్ట్ర అటవీ శాఖలను కూడా భాగస్వాములను చేయవచ్చునని తెలిపారు. 2010 జనవరి నెలాఖరుకు ఈ రోడ్‌మ్యాప్‌ను పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖకు సమర్పించాలని తెలిపారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం చిరుత పులులను కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటిని నమీబియా నుంచి తీసుకొచ్చారు. మన దేశంలో చిరుత పులుల జాతి అంతరించిపోయినట్లు ప్రకటించిన 70 ఏళ్ళ అనంతరం వీటిని మన దేశానికి తీసుకొచ్చారు. 


Updated Date - 2022-09-18T19:35:50+05:30 IST