నిధులను తరలించుకుపోయిన హరీశ్‌రావు ఇప్పుడెలా అభివృద్ధి చేస్తారు

ABN , First Publish Date - 2020-10-25T06:34:43+05:30 IST

దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులను తరలించుకుపోయిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు ఎలా ఓట్లడుగుతున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి ప్రశ్నించారు

నిధులను తరలించుకుపోయిన హరీశ్‌రావు ఇప్పుడెలా అభివృద్ధి చేస్తారు

ఫాంహౌస్‌లోని కేసీఆర్‌ను ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలి 

టీఆర్‌ఎస్‌ను ఓడించి కనువిప్పు కలిగించాలి 

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి 


చేగుంట, అక్టోబరు 24: దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులను తరలించుకుపోయిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు ఎలా ఓట్లడుగుతున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి ప్రశ్నించారు. నార్సింగి మండలం నర్సంపల్లి తండా, నార్సింగిలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి శనివారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చిన నిధులన్నీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటకు తరలించుకుపోయారని ఆరోపించారు. హరీశ్‌రావు వచ్చి అభివృద్ధి చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో దుబ్బాక నియోజకవర్గంపై హరీశ్‌రావు సవితి తల్లి ప్రేమ చూపించారని.. మళ్లీ ఇప్పుడు అభివృద్ధి చేస్తా అంటే ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ పరిస్థితులపై ఏమాత్రం అవగాహనలేని సోలిపేట సుజాతను గెలిపించుకుంటే వచ్చిన నిధులను సిద్దిపేట, గజ్వేల్‌కు తరలించవచ్చని హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే అభివృద్ధిలో దుబ్బాక మరో పదేళ్లు వెనక్కి పోతుందని ఆయన జోస్యం చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డి నార్సింగికి తెచ్చిన అభివృద్ధి పనుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. పనులన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు మిగిలిపోయాయని తెలిపారు.


నియోజకవర్గంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. అంతకుముందు కాంగ్రెస్‌ మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ పేదలను దోచుకునేందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిందని విమర్శించారు.


ప్రజలెవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం కట్టవద్దని కోరారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి కేసీఆర్‌కు కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. ఫాంహౌస్‌లో ఉండే కేసీఆర్‌ను ప్రజాక్షేత్రంలోకి తీసుకువచ్చే అవకాశం దుబ్బాక ప్రజలకు వచ్చిందని వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీసేందుకు అసెంబ్లీకి ప్రశ్నించే గొంతుకను పంపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రమణ, వెంకట్‌రెడ్డి నరేందర్‌రెడ్డి, యాదగిరి యాదవ్‌, గోవర్ధన్‌, శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T06:34:43+05:30 IST