కాంగ్రెస్, పీకే రాజకీయాలను బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా?

ABN , First Publish Date - 2022-04-26T01:45:54+05:30 IST

గత రెండు రోజులుగా తెలంగాణలో ప్రముఖంగా ప్రశాంత్ కిషోర్ పేరు వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ప్రగతి భవన్‌లో ...

కాంగ్రెస్, పీకే రాజకీయాలను బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా?

హైదరాబాద్:  గత రెండు రోజులుగా తెలంగాణలో ప్రముఖంగా ప్రశాంత్ కిషోర్ పేరు వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ప్రగతి భవన్‌లో రెండు రోజుల బస చేశారు. ఈ రెండు రోజుల సమయంలోనూ దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో పీకే రెండు రోజులు మంతనాలు జరిపారు. తెలంగాణలో తన సంస్థ ఐప్యాక్.. టీఆర్ఎస్‎తో కలిసి పని చేస్తుందని.. జాతీయ స్థాయిలో తాను కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తానని కేసీఆర్ వివరించారు. ఈ  ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ వెళ్లిపోయారు. 


కాగా ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ వ్యూహకర్త.. ఆయన పని చేసే ప్రతి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. తన వ్యూహాలను అమలు చేసి కొన్ని పార్టీలను పలుచోట్ల అధికారంలోకి తీసుకొచ్చాడు. పీకే పని చేసిన పార్టీల్లో ప్రముఖంగా వినిపించేది వైసీపీ పేరు. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో జగన్‌తో కలిసి పని చేశారు. ఆ ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇటీవలకాలంలో పశ్చిమబెంగాల్‌లోనూ మమతా బెనర్జీని సీఎంను చేసేందుకు తీవ్రంగా కృషి చేశాడు.. సక్సెస్ అయ్యాడు. అంతకుముందు కేజ్రీవాల్ విషయంలోనూ అలానే జరిగింది. దీంతో దేశంలోని పలు పార్టీలకు పీకే‌పై నమ్మకం అమాంతం పెరిగింది. 


ఇక 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని పార్టీలు ఆయనతో కలిసి వెళ్లబోతున్నాయి.  ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా పీకే టీమ్ సలహాలు తీసుకోనుంది. ఈ మేరకు ముందుగా పీకేను కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని భావిస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొట్టాలంటే ఉమ్మడి పోరాటం తప్పదన్న పీకే సలహా మేరకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ యేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. అటుగా అడుగులు వేస్తోంది. ఇందుకు ప్రశాంత్ కిషోర్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం... తమ పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమైంది. కాంగ్రెస్‌లో పీకే చేరికపై చర్చింది. ప్రతిపాదనలు, సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలపాలని సూచించింది. 


అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్‎తో కలిసి పని చేస్తోన్న పీకేను ఎలా పార్టీలోకి తీసుకుంటారని టీ కాంగ్రెస్‌లోని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నేతలైతే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అంటున్నారు. అటు టీఆర్ఎస్ నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిశితంగా గమనిస్తోంది. మరి పీకే అంశంపై బీజేపీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి. 



ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ‘‘ దేశ రాజకీయం ప్రశాంత్ కిషోర్ చుట్టూ ఎందుకు తిరుగుతోంది?. మరి కాంగ్రెస్‌లో వినిపిస్తున్న అసంతృప్తి స్వరాల మాటేమిటి?. వైసీపీ-టీఆర్ఎస్ పార్టీల విషయంలో పీకే వ్యూహం ఏంటి?. కాంగ్రెస్, పీకే రాజకీయాలను బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-04-26T01:45:54+05:30 IST