Privatization of banks : బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆర్బీఐ హెచ్చరిస్తోంది : కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-08-20T00:16:10+05:30 IST

బ్యాంకుల ప్రైవేటీకరణ (Privatization of banks)ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్

Privatization of banks : బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆర్బీఐ హెచ్చరిస్తోంది : కాంగ్రెస్

న్యూఢిల్లీ : బ్యాంకుల ప్రైవేటీకరణ (Privatization of banks)ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ తన వాదనకు మద్దతుగా భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఓ వ్యాసాన్ని చూపించింది. బ్యాంకులను ప్రైవేటీకరించడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రయత్నాలపై ఈ వ్యాసం గట్టిగా హెచ్చరించిందని తెలిపింది. అయితే ఇది ఆ వ్యాసకర్తల అభిప్రాయమేనని ఆర్బీఐ పేర్కొంది. 


కాంగ్రెస్ ప్రస్తావించిన వ్యాసాన్ని స్నేహల్ ఎస్ హెర్వాడ్కర్, సోనాలీ గోయల్, రిషుక బన్సల్ రాశారు. వీరు ఆర్బీఐ (Reserve Bank of India), ఆర్థిక, విధాన పరిశోధన శాఖ, బ్యాంకింగ్ రీసెర్చ్ డివిజన్‌కు చెందినవారు. ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆ వ్యాసకర్తలకు చెందినవి మాత్రమేనని ఆర్బీఐ పేర్కొంది. ఈ వ్యాసాన్ని తన అభిప్రాయంగా భావించరాదని స్పష్టం చేసింది. 


ఈ వ్యాసం ముఖ్యంగా ఏం చెప్పిందంటే, ఆర్థిక ప్రయోజనాల కల్పనలో అందరినీ కలుపుకునిపోవడం చాలా ముఖ్యమైన సాంఘిక లక్ష్యమని తెలిపింది. పెద్ద ఎత్తున జరిగే బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల ఈ లక్ష్యాల సాధనకు ఎటువంటి విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని పేర్కొంది. దీని కోసం అంచెలంచెలుగా చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు బలహీనంగా ఉన్నాయని విమర్శలు ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి షాక్‌ను చాలా బాగా తట్టుకుని కోలుకున్నాయని తెలిపింది. ఇటీవలి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఈ రంగం ఏకీకృతమైందని పేర్కొంది. మరింత బలమైన, పటిష్టమైన, పోటీతత్వం నిండిన బ్యాంకులు ఏర్పడ్డాయని వివరించింది. లాభాలను గరిష్ఠ స్థాయికి చేర్చడంలో ప్రైవేటు రంగ బ్యాంకులు అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్నాయని, అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడంలో మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. 


కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఈ వ్యాసాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆర్బీఐ హెచ్చరిస్తోందని చెప్పారు. ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే 27 నుంచి 12కు తగ్గిపోయాయని తెలిపారు. ప్రభుత్వం బహుశా ఈ సంఖ్యను 1కి చేర్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆర్బీఐ చెప్తున్నదానినిబట్టి ఇది విపత్తును ఆహ్వానించడం వంటిదేనన్నారు. అయితే మోదీ ప్రభుత్వం తన ఇష్టాయిష్టాలు, నమ్మకాలు, భ్రమలతో కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో సైతం ఆర్బీఐ ఇచ్చిన సలహాను కేంద్ర ప్రభుత్వం వినలేదన్నారు. 


Updated Date - 2022-08-20T00:16:10+05:30 IST