కాంగ్రెస్‌ నాయకుల ప్రజాభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2020-12-03T04:40:34+05:30 IST

జిల్లా కేంద్రంలో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

కాంగ్రెస్‌ నాయకుల ప్రజాభిప్రాయ సేకరణ
ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న కాంగ్రెస్‌ నాయకులు

మంచిర్యాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్‌ టౌన్‌ నుంచి టూ టౌన్‌ వెళ్లేందుకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం జరగాలా..? లేక రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలా..? ప్రస్తుతం ఉన్న గేటు ఉండాలా...వద్దా... అనే అంశాలపై ప్రజల నుంచి ఓటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనా రాయణ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రావుల ఉప్పలయ్య మాట్లాడారు. రైల్వే వంతెన నిర్మాణంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు తీవ్ర కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. వంతెన నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి, మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు కేవలం ఓట్ల కోసమే బ్రిడ్జి నిర్మాణాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. ప్రజలు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కోరుకుంటుంటే, దాన్ని కాదని అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి తెరలేపారని అని వాపోయారు. అధికార పార్టీ నాయకుల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు వివరించారు. కాగా ఓటింగ్‌లో టూ టౌన్‌ ప్రజల చిరకాల ప్రతిపాదన రైల్వే ఓవర్‌ బ్రిడ్డిని నిర్మించాలి, ప్రస్తుతం ఉన్న రైల్వే గేట్‌ యథావిధిగా కొనసాగిస్తూ అండర్‌ బ్రిడ్జి నిర్మించాలి, ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న అండర్‌ బ్రిడ్జి నిర్మాణం చేసి గేటు మూసివేయవచ్చు అనే మూడు అంశాలపై బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. వాటిలో మొదటి అంశానికి ఏకంగా 675 మంది ఓటు వేశారు. రెండ అంశానికి ఆరుగురు, ఒకటి రెండు అంశాలకు ఇద్దరు, మూడో అంశానికి ఇద్దరు చొప్పున ఓట్లు వేశారు. దీంతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జినే నిర్మించాలని ప్రజలు ఏకపక్షంగా కోరుకున్నట్లుగా తెలుస్తోందని కాంగ్రెన్‌ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణాధ్యక్షుడు అంకం నరేష్‌, మున్సిపల్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ వేముపల్లి సంజీవ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్‌, మైనారిటీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ సత్తార్‌, పట్టణ ఉపాధ్యక్షుడు జోగుల సదానందంతోపాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T04:40:34+05:30 IST