Goa Congressలో చిచ్చు... కొందరు ఎమ్మెల్యేలు త్వరలో BJPలోకి!...

ABN , First Publish Date - 2022-07-10T21:10:27+05:30 IST

గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు బీజేపీవైపు చూస్తున్నట్లు విశ్వసనీయ

Goa Congressలో చిచ్చు... కొందరు ఎమ్మెల్యేలు త్వరలో BJPలోకి!...

పనజీ : గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు బీజేపీవైపు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో, మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్ఠానంతో ఓ అవగాహన కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలు పచ్చ జెండా ఊపిన వెంటనే ఆ పార్టీలో చేరిపోయేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారని సమాచారం. 


కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాము ఏ సమయంలోనైనా బీజేపీలో చేరిపోయే అవకాశం ఉందన్నారు. బీజేపీ అధిష్ఠానం నుంచి ఫోన్ కాల్ కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. మంత్రి పదవులు, లేదా, ఇతర పదవుల గురించి బీజేపీ తమకు ఎటువంటి హామీలు ఇవ్వలేదన్నారు. 


అనర్హత వేటు నుంచి తప్పించుకుంటూ...

ఈ వార్తలను కామత్, లోబో తోసిపుచ్చారు. అయితే అనర్హత వేటు నుంచి తప్పించుకునే విధంగా సామూహికంగా బీజేపీలో చేరాలని ఈ ఎమ్మెల్యేలంతా నిర్ణయించుకున్నట్లు, అందుకు బీజేపీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. 


కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు

గోవా శాసన సభలో 40 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. 


రానున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టి

2019లో దక్షిణ గోవా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. ఈ నేపథ్యంలో 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ నిర్ణయం అంతగా రుచించడం లేదని సమాచారం. బీజేపీ గోవా శాఖ అధ్యక్షుడు సదానంద్ షేట్ తనవడే ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక గురించి కేంద్ర నాయకత్వం నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. 


ఇది రెండోసారి

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీజేపీలో చేరడం కొత్త విషయం కాదు. 2019 జూలైలో చంద్రకాంత్ బాబు కవలేకర్, మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 2022లో శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎమ్మెల్యే అభ్యర్థుల చేత చర్చి, దేవాలయాల్లో ప్రమాణాలు చేయించింది. తాము గెలిచిన తర్వాత పార్టీని మోసం చేసి, బీజేపీలో చేరబోమని ప్రతిజ్ఞ చేయించింది. కానీ ఆ ప్రమాణాలను లెక్క చేయకుండా దాదాపు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరుతుండటం ఇది రెండోసారి అని గుర్తు చేస్తున్నారు. 


రంగంలోకి గుండూ రావు

ఇదిలావుండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం అందడంతో కాంగ్రెస్ గోవా ఇన్‌ఛార్జి దినేష్ గుండూరావు తక్షణం స్పందించారు. యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఓ హోటల్‌లో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి దిగంబర్ కామత్ గైర్హాజరయ్యారు. ఆయన కనకోన మఠానికి వెళ్లారని గుండూరావు చెప్పారు. 


Updated Date - 2022-07-10T21:10:27+05:30 IST