Agnipath Scheme: పైసల ఆదా కోసం భద్రతను పణంగా పెట్టడమే : కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-06-17T00:54:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది

Agnipath Scheme: పైసల ఆదా కోసం భద్రతను పణంగా పెట్టడమే : కాంగ్రెస్

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. ఇది పైసలను ఆదా చేయడం కోసం భద్రతను పణంగా పెట్టడమేనని ఆరోపించింది. రక్షణ దళాల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, విస్తృత చర్చ లేకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టింది. తక్షణమే ఈ పథకాన్ని నిలిపేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేసింది. 


అగ్నిపథ్ పథకం (Agnipath Scheme)పై బిహార్ (Bihar) తదితర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం, ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా గురువారం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. 


భద్రతను గాలికొదిలేసే పథకం

పి చిదంబరం (P. Chidambaram) మాట్లాడుతూ, అగ్నిపథ్ పథకం పైసలను ఆదా చేయడం కోసం భద్రతను పణంగా పెట్టే విధంగా ఉందన్నారు. ఆరు నెలల్లో సైనికుడికి ఏ విధంగా శిక్షణ ఇస్తారని ప్రశ్నించారు. ఇది ఎన్‌‌సీసీ కాదని, బాయ్ స్కౌట్ శిక్షణ కాదని అన్నారు. ఇది పోరాటమని, సైనికుడు తన దేశం కోసం మాత్రమే కాకుండా, తన కామ్రేడ్స్ కోసం తన ప్రాణాలను త్యాగం చేయవలసి ఉంటుందని అన్నారు. సైనికుడు కందకాల్లో ఉండి పని చేయవలసి ఉంటుందన్నారు. అలాంటి లక్షణాలను కేవలం ఆరు నెలల శిక్షణలో అలవాటు చేయలేరని చెప్పారు. దీనిని బాయ్ స్కౌట్ ట్రైనింగ్‌గా పరిగణిస్తున్నారని, సగం శిక్షణ ఇచ్చి, ఎక్కడ మోహరిస్తారని నిలదీశారు. పరిస్థితులపై వాస్తవాలతో కూడిన ప్రకటనను తయారు చేసి, దానిని రాజకీయ పార్టీలు, ప్రస్తుత, రిటైర్డ్ మిలిటరీ అధికారులకు ఇచ్చిన తర్వాత కొత్త పథకాన్ని తీసుకురావడం సరైనదవుతుందని చెప్పారు. 


ఈ పథకం క్రింద నియమితులయ్యే సైనికులు ఉత్తమ శిక్షణ పొందుతారని, దేశాన్ని రక్షించేందుకు ప్రేరణ పొందుతారని భరోసా ఏమీ లేదని అన్నారు. రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను తెలుసుకున్నామని చెప్పారు. వారంతా దాదాపు ఏకగ్రీవంగా ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న సైనికాధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని భావిస్తున్నామని చెప్పారు. సరైన శిక్షణ లేని, సరైన ప్రేరణ లేని సైనికులను ఈ పథకం రక్షణ దళాల్లోకి చేర్చుతుందని,  నిరుత్సాహం, విచారంతో కూడిన మాజీ సైనికులను నాలుగేళ్ళ తర్వాత సమాజంలోకి పంపిస్తుందని అన్నారు. 


సాగు చట్టాల తరహాలోనే

సచిన్ పైలట్ (Sachin Pilot) మాట్లాడుతూ, సాగు చట్టాలను ప్రవేశపెట్టినపుడు కూడా రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. చివరికి ఆ చట్టాలను ఉపసంహరించుకోవలసి వచ్చిందన్నారు. అదే విధంగా అగ్నిపథ్ వల్ల యువతకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెప్తోందని, అయితే యువత వీథుల్లోకి పోటెత్తారని చెప్పారు. 


నాలుగు సూటి ప్రశ్నలు

అజయ్ మాకెన్ (Ajay Maken) మాట్లాడుతూ, కేవలం స్వల్ప కాలం మాత్రమే దేశానికి సేవ చేయడం అగ్నివీరులకు సంతృప్తికరంగా ఉంటుందా? కేవలం ఆరు నెలల్లో తగిన శిక్షణ లభిస్తుందా? దేశం కోసం యుద్ధం చేయడానికి తగిన ప్రోత్సాహం లభిస్తుందా? నాలుగేళ్ళ తర్వాత తమలో కొందరు వేరొక పని చేసుకోవలసి ఉంటుందని తెలుసుకున్నపుడు వారికి భద్రత ఉంటుందా? అని ప్రశ్నించారు. 


Updated Date - 2022-06-17T00:54:32+05:30 IST