Moradabadలో ప్రియాంక ప్రచారంపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2022-02-11T17:19:04+05:30 IST

మొరాదాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ ఖురేషీ ఇంటింటి ప్రచారం సందర్భంగా రోడ్‌షో లాంటి పరిస్థితి తలెత్తడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు....

Moradabadలో ప్రియాంక ప్రచారంపై పోలీసు కేసు

మొరాదాబాద్: మొరాదాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ ఖురేషీ ఇంటింటి ప్రచారం సందర్భంగా రోడ్‌షో లాంటి పరిస్థితి తలెత్తడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.మొరాదాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఖురేషీ గురువారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం రోడ్‌షోలా కనిపించింది.‘‘కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ ఇంటింటికీ ప్రచారం కోసం అనుమతి తీసుకున్నారు, కానీ అతనితో పాటు కారుపై ఉన్న వ్యక్తులతో రోడ్‌షో లా నిర్వహించారు. సెక్టార్ మేజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంపై కేసు నమోదు చేశాం’’ అని మొరాదాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిలేష్ భడోరియా మీడియా ప్రతినిధులకు చెప్పారు. 


భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నప్పుడు వారిపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ ప్రశ్నించారు.‘‘కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ ఇంటింటికీ వెళ్లి సమావేశాలు జరిపారు. మీరట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు, వారిపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు లేదు? ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తే మా తప్పు కాదు. ఇంటింటి ప్రచారంలో ప్రజల ప్రేమతో.. బీజేపీకి భయం పట్టుకుంది, అందుకే ఈ రాజకీయం జరుగుతోంది’’ అని రిజ్వాన్ వ్యాఖ్యానించారు.సహారన్‌పూర్, బిజ్నోర్, అమ్రోహా, సంభాల్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ, బుదౌన్, షాజహాన్‌పూర్‌లోని తొమ్మిది జిల్లాల పరిధిలో మొత్తం 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.


Updated Date - 2022-02-11T17:19:04+05:30 IST