పూరీ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టుపై అనుమానాలు ఉన్నాయి : కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-04-29T16:51:24+05:30 IST

ఒడిశాలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ జగన్నాథ దేవాలయం

పూరీ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టుపై అనుమానాలు ఉన్నాయి : కాంగ్రెస్

భువనేశ్వర్ : ఒడిశాలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ జగన్నాథ దేవాలయం సమీపంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతుండటంపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఆంక్షలు అమలవుతున్న ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలను తనిఖీ చేయడానికి ఏర్పాటైన  శాసన సభ కమిటీ సభ్యుడు నరసింఘ మిశ్రా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే బీజేపీ కూడా ఇటువంటి ఆరోపణలు చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 


ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి ఉల్లంఘనలు జరగడం లేదని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ మహాపాత్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో సమన్వయం కుదుర్చుకుని ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు మరుగుదొడ్లు, సామాన్లను భద్రపరచే గదులు వంటి సదుపాయాలను కల్పించేందుకు ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. 


బీజేపీ భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పారదర్శకతను ప్రశ్నించారు. పూరీని అంతర్జాతీయ వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారని, దీనిలో పారదర్శకత కనిపించడం లేదని అన్నారు. 


సీఎల్‌పీ నేత, 12వ శతాబ్దంనాటి జాతీయ కట్టడానికి సంబంధించిన ఆంక్షలు అమలవుతున్న ప్రాంతంలో నిర్మాణాలను తనిఖీ చేసేందుకు ఏర్పాటైన ఒడిశా శాసన సభ కమిటీ సభ్యుడు నరసింఘ మిశ్రా స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటించి, పనులను గురువారం పరిశీలించారు. ఈ పనుల కోసం ఏఎస్ఐ నుంచి అనుమతి పొందలేదని బీజేపీ ఎంపీ చెప్తున్నారన్నారు. అదేవిధంగా ఓ సమాచార హక్కు కార్యకర్త కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏఎస్ఐ నుంచి అనుమతిని పొందలేదని చెప్తున్నారని, దీంతో అంతా గందరగోళంగా తయారైందని ఆరోపించారు. 


తాను నిపుణుడిని కాకపోయినప్పటికీ, శ్రీ జగన్నాథుని దేవాలయం సరిహద్దు గోడ వద్ద దాదాపు ఐదు నుంచి పది అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు వీలుగా పునాదులు తవ్వినట్లు కనిపిస్తోందన్నారు. ఈ పనులు నిషేధిత ప్రాంతంలో జరుగుతున్నాయన్నారు. దీనికి ఏఎస్ఐ అనుమతి అవసరమని చెప్పారు. ఏఎస్ఐ నుంచి అనుమతి పొందకుండా ఎటువంటి పనులు చేయకూడదని చెప్పారు. ఈ పనులను తనిఖీ చేసేందుకు నియమితమైన సభా సంఘం ఇంకా ఈ ప్రాంతంలో తనిఖీలను నిర్వహించలేదని చెప్పారు. ఈ అంశం హైకోర్టు విచారణలో ఉన్నందువల్ల సభా సంఘం తనిఖీ చేయవచ్చునా? లేదా? అనే అంశంపై సభాపతి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తనకు తెలిసినంత వరకు సభా కమిటీకి అటువంటి పరిమితులేమీ లేవన్నారు. తమ పార్టీ (కాంగ్రెస్) అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి పనులు చేయకూడదని చెప్పారు. 


పూరీ బీజేపీ ఎమ్మెల్యే జయంత సారంగి మాట్లాడుతూ, తాను బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి లేవనెత్తిన అంశాలతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. తమకు అభివృద్ధి కావాలని, అయితే చట్ట ప్రకారం అభివృద్ధి జరగాలని అన్నారు. 


ఈ నేపథ్యంలో ఒడిశా అధికార పార్టీ బీజేడీ నేతలు స్పందిస్తూ, ప్రతిపక్షాలు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. బీజేడీ చీఫ్ విప్ ప్రమీల మల్లిక్ మాట్లాడుతూ, నిపుణులతో సంప్రదించిన తర్వాతే నిర్మాణ కార్యకలాపాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ ప్రాజెక్టులో చట్టాల ఉల్లంఘన జరగడం లేదన్నారు. 


మరోవైపు పూరీ గజపతి మహారాజ దిబ్యసింఘ దేబ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు వల్ల శ్రీ జగన్నాథుని దేవాలయంపై ప్రతికూల ప్రభావం ఉండబోదని తెలిపారు. 


Updated Date - 2022-04-29T16:51:24+05:30 IST