కాంగ్రెస్‌కు ప్రతిభ ఉంది, కానీ... : వివేక్ తన్‌ఖా

ABN , First Publish Date - 2022-03-13T20:43:47+05:30 IST

కాంగ్రెస్ పార్టీలో ప్రతిభావంతులు ఉన్నారని, ప్రజలకు చేరువలో

కాంగ్రెస్‌కు ప్రతిభ ఉంది, కానీ... : వివేక్ తన్‌ఖా

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో ప్రతిభావంతులు ఉన్నారని, ప్రజలకు చేరువలో పార్టీ ఉందని, అయితే ఇప్పుడు ఉమ్మడి కృషి అవసరమని ఆ పార్టీ సీనియర్ నేత వివేక్ తన్‌ఖా చెప్పారు. ‘మనం ఉమ్మడిగా పని చేద్దాం, మనం ఆ పని చేయగలం’ అని ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 2020 ఆగస్టులో ఆ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసిన 23 మంది నేతల్లో వివేక్ కూడా ఉన్నారు. 


23 మంది కాంగ్రెస్ నేతలు 2020 ఆగస్టులో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీని క్రింది నుంచి పై వరకు ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, శశి థరూర్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ, పీజే కురియన్, మిలింద్ దేవరా, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద, భూపేంద్ర సింగ్ హుడా, రాజిందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృధ్వీరాజ్ చవాన్, అజయ్ సింగ్, రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ లవ్‌లీ, కేఎస్ ఠాకూర్, కుల్‌దీప్ శర్మ, యోగానంద్ శాస్త్రి, సందీప్ దీక్షిత్, వివేక్ తన్‌ఖా తదితరులు ఈ లేఖ రాశారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, పార్టీ పీసీసీ చీఫ్‌లుగా పని చేసినవారు ఉన్నారు. 


2012 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ క్రమంగా పరాజయాలను ఎదుర్కొంటోంది. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్టీలో సంస్కరణలు జరుగుతాయని చాలా మంది నేతలు భావించారు కానీ అలాంటిదేమీ జరగడం లేదు. తాజాగా జరిగిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఆదివారం మధ్యాహ్నం నిర్వహించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఎన్నికలు జరిగిన వెంటనే సీడబ్ల్యూసీని సమావేశపరచడం చాలా కాలం తర్వాత ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెప్తున్నారు. 


ఈ నేపథ్యంలో వివేక్ తన్‌ఖా ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఇది ఆలోచించవలసిన సమయమని తెలిపారు. మీకు పార్టీ ఏం చేస్తుందనేది కాకుండా, పార్టీకి మీరు ఏం చేయగలరనేదానిని ఆలోచించాలని పిలుపునిచ్చారు. భారత దేశ భావనను మరోసారి పునర్నిర్మించాలని సీడబ్ల్యూసీకి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. మనకు ప్రతిభ ఉందని, ప్రజలకు చేరువలో ఉన్నామని తెలిపారు. మనకు కావలసిందల్లా ఉమ్మడి కృషి అని చెప్పారు. మనం సమష్టి కృషి చేద్దామని, మనం చేయగలమని చెప్పారు. 


Updated Date - 2022-03-13T20:43:47+05:30 IST