పరిపూర్ణ పతనంలో కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-03-11T09:33:58+05:30 IST

ప్రతిఎన్నికల పోరాటమూ విజేతల, పరాజితుల గాథే. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానాలు అనివార్యంగా విజేతలకే ప్రాధాన్యమిస్తాయి....

పరిపూర్ణ పతనంలో కాంగ్రెస్

ప్రతిఎన్నికల పోరాటమూ విజేతల, పరాజితుల గాథే. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానాలు అనివార్యంగా విజేతలకే ప్రాధాన్యమిస్తాయి. అయితే ఈ కాలమ్‌లో నేను ప్రధాన పరాజిత పార్టీపై దృష్టిని కేంద్రీకరిస్తాను. ఉత్తరప్రదేశ్‌లో ఓటర్లు మళ్లీ ఆదిత్యనాథ్, భారతీయ జనతా పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయం సాధించింది. భారత జాతీయ కాంగ్రెస్ తిరుగులేని పతనక్రమంలో ఉందన్న వాస్తవాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి ధ్రువీకరించాయి.


తొలుత అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ విషయాన్ని చూద్దాం. లోక్‌సభకు 80 మంది ఎంపీలను పంపే రాష్ట్రమది. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర్యోద్యమానికి యూపీ ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. స్వాతంత్ర్యానంతరం తొలి ముగ్గురు ప్రధానమంత్రులూ ఆ రాష్ట్రం నుంచి ప్రభవించిన వారే. అయితే 1960వ దశకం ఉత్తరార్థంలో యూపీ రాజకీయాలపై కాంగ్రెస్ పట్టు సడలిపోవడం ప్రారంభమయింది. 1980 దశకం ముగిసే నాటికి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక అప్రధాన రాజకీయ శక్తిగా మిగిలిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు పురా వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రియాంకా గాంధీ ప్రయత్నించారు. ఢిల్లీ నుంచి లక్నోకు తన నివాసాన్ని మార్చేందుకు గానీ, యూపీ అసెంబ్లీకి పోటీ చేసేందుకుగానీ ఆమె అంగీకరించలేదు. అయితే ఆమె నిత్యం యూపీలో పర్యటించారు. ప్రియాంక పర్యటనలకు మీడియాలో విశేష ప్రచారం లభించింది. నెహ్రూ–-గాంధీలను ఆరాధించే మీడియా వర్గాలు ఆమె ప్రతి పర్యటనకు, పత్రికా గోష్ఠికి అమిత ప్రాధాన్యమిచ్చింది. ప్రియాంక నేతృత్వంలో యూపీలో కాంగ్రెస్ ఒక కీలక రాజకీయ శక్తిగా ఆవిర్భవించనున్నదని ఊదరగొట్టాయి. అంతిమంగా కాంగ్రెస్‌కు ప్రియాంక సాధించిన ఓట్లు 2 శాతానికి మించి స్వల్పంగా పెరిగాయి. లభించిన సీట్లు గత అసెంబ్లీ ఎన్నికలలో లభించిన వాటి కంటే కూడా తక్కువే.


యూపీలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రియాంక మంచి ప్రయత్నమే చేశారు. అయితే అది ఏమంతగా ఫలించలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పార్టీ మళ్లీ అధికారానికి వచ్చే అవకాశాలను రాహుల్ గాంధీ తన నిర్ణయాలతో వమ్ము చేశారు. ఏడాదిలోగా ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రిని మార్చివేయడం పార్టీకి ఎలా మేలు చేస్తుంది? అమరీందర్ సింగ్ పట్ల పార్టీ ఎమ్మెల్యేలలో వ్యతిరేకత ఉన్న మాట నిజమే అయినప్పటికీ అమరీందర్‌కు మెరుగైన పాలనానుభవం ఉన్నది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన రైతుల ఉద్యమానికి ఆయన పూర్తి మద్దతునిచ్చారు. ఏడాది క్రితం పంజాబ్‌లో కాంగ్రెస్‌కు, ఆమ్ఆద్మీ పార్టీకి విజయావకాశాలు చెరి సమానంగా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్‌ను తొలగించి ఎవరికీ పెద్దగా తెలియని చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించడం, ఆ తరువాత ఆయనకు కాకుండా నవజోత్ సింగ్ సిద్ధూకు అమిత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రాహుల్ గాంధీ స్వయంగా కాంగ్రెస్ ఓటమికి బాటలుపరిచారు. గోవా, ఉత్తరాఖండ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రెండు రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. ఉత్తరాఖండ్‌లో అవినీతి ఆరోపణల కారణంగా ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలలోనూ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పట్ల ప్రజా వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమయింది. తత్ఫలితంగానే అధికారాన్ని మళ్లీ కైవసం చేసుకోలేకపోయింది. మణిపూర్‌లో సైతం బీజేపీయే మళ్లీ విజయం సాధించింది.


ఈ ఫలితాలు సూచిస్తున్నదేమిటి? ప్రస్తుత నాయకత్వంలో కాంగ్రెస్ మళ్లీ జాతీయ రాజకీయాలలో ప్రధాన శక్తి కావడం కల్ల. ఈ వాస్తవం చాలా మందికి తెలుసు. అది మరొకసారి తిరుగులేని విధంగా రూఢి అయింది. 2019 సార్వత్రక ఎన్నికలలో అవమానకరమైన పరాజయం అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. పార్టీ సారథ్యాన్ని ఆయన తల్లి సోనియా గాంధీ చేపట్టారు. ఆమె సారథ్యం తాత్కాలికమే అని చెప్పారు. అయితే రెండున్నరేళ్లు గడిచినప్పటికీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మొత్తం మీద నెహ్రూ-–గాంధీ కుటుంబ నియంత్రణలోనే కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇది కాంగ్రెస్‌కు ఎటువంటి మేలు చేస్తోంది? ఏమీ చేయడం లేదని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. 2019లో కాంగ్రెస్ తనుతాను పునరావిష్కరించుకునేందుకు కాంగ్రెస్‌కు ఒక అవకాశం లభించింది. అయితే కాంగ్రెస్ దాన్ని జారవిడిచింది. మరి ఇప్పుడేం చేయనున్నది?


పార్టీ శ్రేయస్సు కోసం, భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం గాంధీలు పార్టీనాయకత్వం నుంచి నిష్క్రమించడం మాత్రమేకాదు, అసలు రాజకీయాల నుంచే వైదొలగడం ఉత్తమమని నేను విశ్వసిస్తున్నాను. రాష్ట్రాలలోను, జాతీయ రాజకీయాలలోనూ కాంగ్రెస్‌ను ఒక ప్రధానశక్తిగా నిలపగల శక్తి సామర్థ్యాలు తమకు లేవని రాహుల్, ప్రియాంకలు తమకుతామే నిరూపించుకున్నారు. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే కాంగ్రెస్ నాయకత్వంలో గాంధీలు ఉండడం వల్లే తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో నరేంద్ర మోదీ విజయవంతమవుతున్నారు. వర్తమాన వ్యవహారాల కంటే గతంపైనే చర్చలు జరిగేలా చేయడం ద్వారా మోదీ తన ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల దృష్టికి వెళ్లకుండా చేయగలుగుతున్నారు. రక్షణ రంగ కొనుగోళ్లలో అవినీతి విషయమై ఆరోపణలకు రాజీవ్ గాంధీ, బోఫోర్స్ కుంభకోణం ప్రస్తావనలతో ఆయన సమాధానమిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, రాజకీయ, సామాజిక కార్యకర్తల నిర్బంధాల విషయమై వస్తున్న విమర్శలకు ఇందిరాగాంధీ, అత్యవసర పరిస్థితి గురించిన ప్రస్తావనలతో తిప్పి కొడుతున్నారు. లద్దాఖ్‌లో మన భూ భాగాలను చైనా ఆక్రమించుకుందని ఆరోపిస్తే జవహర్ లాల్ నెహ్రూ, 1962 యుద్ధం గురించిన ప్రస్తావనలతో సమాధానమిస్తున్నారు. 


తన ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించానని మోదీ ప్రభుత్వం ఘనంగా చాటుకుంటోంది. వాస్తవమేమిటి? నిశిత, నిష్పాక్షిక పరిశీలకులకు మోదీ ప్రభుత్వ రికార్డు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. కొవిడ్ విలయానికి పూర్వమే వృద్ధిరేట్లు తగ్గిపోయాయి. నిరుద్యోగం పెచ్చరిల్లిపోయింది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు హిందువులు–ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టింది. ఇరుగు పొరుగు దేశాలలో భారత్ గౌరవం క్షీణించింది. సంస్థలు, వ్యవస్థలను బలహీనపరిచింది. పర్యావరణ విధ్వంసం పెరిగిపోయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మోదీ ప్రభుత్వ నిర్వాకాలతో భారత్‌కు ఆర్థికంగా, సామాజికంగా, సంస్థాగతంగా, అంతర్జాతీయంగా, పర్యావరణ పరంగా, నైతికంగా తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ఇన్ని వైఫల్యాలతో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024 సార్వత్రక ఎన్నికలలో మళ్లీ విజయం సాధించగల పరిస్థితిలో ఉంది. ప్రధాన ‘జాతీయ’ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ–గాంధీల నాయకత్వంలో ఉండడమే అందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ , తెలంగాణ రాష్ట్ర సమితి, డిఎంకె, సిపిఎం, ఆమ్ఆద్మీ పార్టీలు తాము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో బీజేపీకి తీవ్ర పోటీ నిస్తున్నాయి. దానిపై ఎన్నికలలో విజయాలు సాధిస్తున్నాయి. కాంగ్రెస్ ఇలా బీజేపీని ఎదుర్కోలేకపోతోంది. గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకొక తిరుగులేని రుజువు. నెహ్రూ–గాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలహీనతలు సార్వత్రక ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019లో 191 నియోజకవర్గాలలో బీజేపీతో ముఖాముఖి తలపడిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలలో మాత్రమే విజయం సాధించగలిగింది.


నెహ్రూ–గాంధీలు బీజేపీకి ప్రత్యర్థులుగా కాక ఒక వరంగా ఉన్నారు! ఒక పక్క బీజేపీకి వారు ఏ విధంగాను గట్టి పోటీనివ్వలేకపోతున్నారు. మరో పక్క జాతీయ రాజకీయ చర్చలు వర్తమాన వ్యవహారాలకు సంబంధించి కాకుండా గతానికి చెందిన విషయాలపై జరిగేలా నిర్దేశించేందుకు బీజేపీకి అవకాశం కల్పిస్తున్నారు. భూస్వామ్య వాతావరణం నుంచి బయటపడుతున్న భారత్‌లో ఒక జాతీయ పార్టీకి ఐదో తరం వారసులు నాయకత్వం వహించడమే ఒక పెద్ద సమస్య. రాజకీయ వివేకం కొరవడిన వారికి వారసత్వంగా నాయకత్వం లభించడం సమస్యను మరింత సంక్లిష్టం చేస్తోంది. 21వ శతాబ్ది భారతీయులు ఎలా ఆలోచిస్తున్నారనే విషయమై గాంధీలకు సరైన అవగాహన లేదు. రాహుల్ గాంధీ పాఠాలు నేర్చుకోని, నేర్చుకోలేని ఒక సగటు నాయకుడు మాత్రమే అని ఒక రచయిత చేసిన కఠోర వ్యాఖ్యలో నిండు నిజం ఉంది. తన తండ్రి, నానమ్మ, ముత్తాత గురించి పదే పదే ప్రస్తావించడం రాహుల్‌కు పరిపాటి. దీన్నిబట్టే ఆయన వర్తమాన రాజకీయాలకు తగిన వ్యక్తి కాదనే విషయం స్పష్టమవుతోంది. నెహ్రూ–గాంధీలు గ్రహించారో లేదో గానీ హిందూత్వ నిరంకుశత్వం బలపడడానికి మరెవ్వరి కంటే వారే చురుకైన దోహదకారులుగా ఉన్నారు. ఈ వారసత్వ నాయకులు రాజకీయాల నుంచి వైదొలిగినా, కాంగ్రెస్ విచ్ఛిన్నమయినా వారి స్థానంలోకి మరింత విశ్వసనీయత ఉన్నవారు తప్పక వస్తారు. అప్పుడు మాత్రమే, హిందూత్వను వ్యతిరేకించే వారు భారత్‌కు మంచి భవిష్యత్‌ను నిర్మించడంలో మరింత ఫలదాయకమైన కృషి చేయగలుగుతారు.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-03-11T09:33:58+05:30 IST