కాంగ్రెస్‌ ‘పెద్దన్న’ కాదు

ABN , First Publish Date - 2022-05-22T07:32:12+05:30 IST

దేశంలో రాజకీయ పార్టీలకు కాంగ్రెస్‌ పార్టీ ‘పెద్దన్న’ కాదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు.

కాంగ్రెస్‌ ‘పెద్దన్న’ కాదు

ప్రాంతీయ పార్టీలను గౌరవిస్తాం

లండన్‌లో రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 21: దేశంలో రాజకీయ పార్టీలకు కాంగ్రెస్‌ పార్టీ ‘పెద్దన్న’ కాదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ప్రాంతీయ పార్టీలను తాము గౌరవిస్తామని, అందరం కలిసికట్టుగా బీజేపీపై పోరాటం చేస్తామని ప్రకటించారు. భారత్‌ను తిరిగి నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. ఉదయ్‌పూర్‌లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. జాతీయ పార్టీగా తమ సిద్ధాంతం తమకు ఉంటుందని, ప్రాంతీయ పార్టీలకు ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయని, అన్నింటినీ తాము గౌరవిస్తామని తెలిపారు. లండన్‌లో ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ పేరిట నిర్వహించిన సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ నెల 15న చింతన్‌ శిబిర్‌లో రాహుల్‌ మాట్లాడుతూ..బీజేపీపై పోరాడాలంటే సైద్ధాంతిక బలం కావాలని, అది ప్రాంతీయ పార్టీలకు లేదని, ఆ బలం ఉన్న కాంగ్రెస్‌ మాత్రమే పోరాడుతుందని అనడంపై ప్రాంతీయ పార్టీలు  ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో లండన్‌ సమావేశంలో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. దీంతోపాటు బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.  ప్రస్తుతం భారత్‌ ఆత్మ.. బీజేపీ దాడికి గురవుతోందని, భారత్‌ గొంతును నొక్కేస్తున్నారని ఆరోపించారు. దేశం  పరిస్థితి పాకిస్థాన్‌లా మారుతోందన్నారు.  


 విద్వేష కిరోసిన్‌ చల్లుతున్న బీజేపీ..

బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేషమనే కిరోసిన్‌ చల్లుతోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇందులో ఏచిన్న నిప్పురవ్వ పడినా.. ప్రమాదం తప్పదన్నారు. ఈ పరిస్థితుల్లో  బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీలో చాలా మంది కాంగ్రె్‌సకు కూడా బీజేపీలాంటి సంస్థాగత నిర్మాణం అవసరం ఉందని అంటుంటారని, కానీ.. దానిని తాను అంగీకరించనన్నారు. ప్రజల అభిప్రాయాలు వినని, గౌరవించని విధానం బీజేపీది అని, అది తమకు వద్దన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో కొందరు భారత విదేశాంగ ఉన్నతాధికారులు చర్చలకు తావులేకుండా అహంకారంతో మాట్లాడుతున్నారంటూ యూర్‌పకు చెందిన ఉన్నతాధికారులు చెబుతున్నారని తెలిపారు. ఇక రష్యా-ఉక్రెయిన్‌ సమస్యను లద్దాఖ్‌లో చైనా చర్యలతో రాహుల్‌ పోల్చారు. అయితే రాహుల్‌వ్యాఖ్యలను బీజేపీతప్పుబట్టింది. విదేశీ గడ్డపై సొంతదేశంలోని ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాహుల్‌కు అలావాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా మండిపడ్డారు.

Updated Date - 2022-05-22T07:32:12+05:30 IST