కాంగ్రెస్‌... కిం కర్తవ్యం?

ABN , First Publish Date - 2022-04-27T09:29:01+05:30 IST

కొద్దిరోజుల క్రితం నుంచీ దేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ వార్తల్లో ఉంటున్నది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో మంతనాలు జరపడం...

కాంగ్రెస్‌... కిం కర్తవ్యం?

కొద్దిరోజుల క్రితం నుంచీ దేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ వార్తల్లో ఉంటున్నది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో మంతనాలు జరపడం ఆ పార్టీ పట్ల జనం ఆసక్తిని ఏర్పర్చింది. ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీలో చేరతాడని, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఆ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయన్న చర్చ సాగింది. కొన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ మూలంగా రాజకీయ పార్టీలు ప్రయోజనం పొందిన దాఖలాలు ఉన్నందువల్లే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మెరుగుపడుతుందనే ఆశ ఆ పార్టీ వాదుల్లో తొణికిసలాడింది. చివరకు ప్రశాంత్ కిషోర్ అనుకున్న హోదాను కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ససేమిరా అనడంతో ఆయన ఆ పార్టీలో చేరేందుకు నిరాకరించారు.


అసలు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, తనయ ప్రియాంకాగాంధీతో సహా హేమాహేమీలందరూ పది రోజుల పాటు ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటల్ని ఆసక్తిగా వినడమే ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది. సీనియర్ నేతలతో పాటు ముఖ్యమంత్రుల్ని కూడా సోనియా పిలిపించి ప్రశాంత్ కిషోర్ చెప్పింది వినమని చెప్పారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయం చెందిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమైన తర్వాత దిక్కుతోచని స్థితిలో పార్టీ నేతలు ఆయన మాటలు వినేందుకు ముందుకు వచ్చారు. తలలు పండిన నేతలు సైతం 45 సంవత్సరాల యువకుడి ప్రజంటేషన్ చూసి తలలూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడు చెప్పినవేవీ వారికి తెలియనివి కావు. పార్టీ అధిష్ఠానం ప్రజలతోనూ, కార్యకర్తలతోనూ సంబంధాలు కోల్పోయిందని, దేశంలో దాదాపు 200 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసి కూడా ప్రయోజనం లేదని ఆయన చెప్పారు. తనను పార్టీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేసే స్వేచ్ఛ ఇస్తే, నేతలు తన మాటలు వినేలా చేస్తే పార్టీని ఎన్నికల బరిలో బలంగా నిలుపుతానని ఆయన మాట ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ అలా చేయగలరా లేదా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. తన సంస్థ ఐపాక్‌తో సంబంధాలు తెంచుకుంటానని, ఆ సంస్థ టీఆర్ఎస్ వంటి ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు. సంస్థ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఎవరి సాయంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పనిచేయించడం ఆయనకు సాధ్యమవుతుందా? ఉన్నట్లుండి బయటనుంచి ఒక వ్యక్తి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తం తానే నడిపిస్తానంటే, మిగతా నేతలు ఎక్కడికి వెళ్లాలి? ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడు కాడు. మోదీలాగా అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చే నేతా కాదు. పార్టీలో అధికారాలు అనుభవిస్తూ కేవలం వ్యూహరచనల ద్వారానే ఎన్నికల్లో గెలిపించడం సాధ్యమవుతుందా? నాయకత్వం లేకపోవడమే కాంగ్రెస్ లోటు. ఆ లోటు ప్రశాంత్ కిషోర్ పూరించగలరా? నిజానికి కాంగ్రెస్‌కు సరైన సలహాలు ఇచ్చే పని ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరకుండానే చేయవచ్చు. గతంలో నరేంద్రమోదీ, జగన్మోహన్ రెడ్డి, నితీశ్‌ కుమార్, మమతా బెనర్జీ, ఇప్పుడు కేసిఆర్‌లకు పనిచేసినట్లే కాంగ్రెస్‌కు సలహాలు ఇచ్చే బాధ్యతను నిర్వహించవచ్చు. ఎవరూ ఎవరికి ఉచితంగా సలహాలనివ్వరు. దానికి ఎంతో కొంత బిల్లు ఉండనే ఉంటుంది. ఈ వ్యాపారాన్ని మానుకుని కాంగ్రెస్‌లో చేరేందుకే ఆయన ఎందుకు ప్రాధాన్యత నిచ్చారు? అందులో ఎజెండా ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నందువల్ల అందులో చేరి ఆ పార్టీని తన నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమవుతుందని భావించారా? లేక ఆయన వెనుక కొన్ని శక్తులు ఆయనను కాంగ్రెస్‌లో చేరమని ప్రోద్బలం చేశాయా? ప్రశాంత్ కిషోర్‌ను చేర్చుకుని తమ అస్తిత్వాన్ని కోల్పోవడం ఇష్టం లేకే పార్టీ నేతలందరూ ఆయనకు పొమ్మనకుండా పొగబెట్టారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు సాధికారిక కమిటీలో చేరి సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్‌కు అవకాశం ఉన్నది. కాని నలుగురిలో ఒకడుగా ఉండి ప్రాధాన్యత కోల్పోవడం ఆయనకూ ఇష్టం లేదు. బహుశా కన్యాశుల్కంలో గిరీశంలా ఆయన ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అని అనుకుని ఉంటారు!


ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బిజెపితో రెండు యుద్దాలు చేసి ఓడిపోయింది. పోటీ చేసిన ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ఎన్నికలోనూ పార్టీ దెబ్బతింటూ వస్తోంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2.32 శాతం మాత్రమే సంపాదించింది. ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న బిజెపిని ఓడించే పరిస్థితులు ఉన్నప్పటికీ గెలిపించగల నాయకత్వం లేదని రుజువు చేసుకుంది. పంజాబ్‌లో ఆఖరి రోజుల్లో ముఖ్యమంత్రిని తొలగించి, ఆచరణ సాధ్యం కాని ప్రయోగాలు చేసి కుప్పకూలిపోయింది. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులు పంజాబ్‌లో డిపాజిట్ కోల్పోయారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. 2014లో కాంగ్రెస్ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. 2013కు ముందు 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలో ఉండేది. 2020 ఎన్నికల్లో ఆ పార్టీకి ఢిల్లీలో కేవలం 5 శాతం ఓట్ల కంటే తక్కువ వచ్చాయి. 63 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా ఉనికే కోల్పోయింది. ప్రశాంత్ కిషోర్ వచ్చినా, ఎవరు వచ్చినా ఢిల్లీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ తల రాతని మార్చగలగిన శక్తి ఉండదు. కాంగ్రెస్ ఇప్పటికీ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంతో కొంత బలంగా ఉన్నది. ఈ రాష్ట్రాల్లో గెలిచేందుకు ఏమి చేయాలో ఆ పార్టీ తీవ్రంగా చర్చించవలిసి ఉన్నది. క్రింది స్థాయి నుంచి పార్టీలో జవజీవాలు కల్పించాల్సి ఉన్నది. గ్రామ స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయాల్సి ఉన్నది. దళితులు, వెనుకబడిన వర్గాలు మళ్లీ కాంగ్రెస్ పట్టులోకి వచ్చేందుకు ఏమిచేయగలమా అని ఆ పార్టీ నేతలు ఆలోచించాల్సి ఉన్నది.


ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనంలో కదలిక తేగలిగిన పరిస్థితిలో ఉన్నదా లేదా, తెచ్చేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని ఆ పార్టీ నేతలే చర్చించుకోవాలి. జనంలో కదలిక రావాలంటే జనాన్ని ఆవహింపచేసే ఒక సిద్ధాంతం అవసరం. భారతీయ జనతా పార్టీకి ఎవరు కాదన్నా, ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నది. పద్ధతి ప్రకారం అది తన సిద్ధాంతాన్ని జనంలో ఆవహింపచేస్తున్నది. కాంగ్రెస్ వారసత్వాన్నీ, సిద్ధాంతాన్నీ, ఆ పార్టీ నేతలను చరిత్ర పుటల్లోంచి తొలగించి తన సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రవేశపెట్టేందుకు బిజెపి పకడ్బందీగా పనిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు అయిన దళితులు, ఆదివాసీలను తన వైపుకు తిప్పుకునేందుకు, ఓబీసీలను ఆకర్షించేందుకు బిజెపి పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ పలుకుబడిగల వివిధ వర్గాల నేతలు బిజెపిలో చేరేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీతో కలిసి పనిచేసే శక్తులు కానీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాన్ని పటిష్ఠం చేసుకుని దాన్ని జనంలో ఉధృతంగా ప్రవేశపెట్టనంతవరకూ ఆ పార్టీకి ఊపు వచ్చే అవకాశాలు లేవు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి సిద్ధాంత కర్త కాదు. అసలు ఆయనకు ఒక సిద్ధాంతం అంటూ ఉన్నదని కూడా చెప్పలేము. నరేంద్రమోదీకైనా, జగన్మోహన్ రెడ్డికైనా. కేసిఆర్‌కైనా ఆయన అప్పటి రాజకీయ పరిస్థితులను అనుసరించి సలహాలు ఇవ్వగలరేమో కాని వారి భావజాలాన్ని మార్చలేరు. తెలంగాణలో కేసిఆర్‌కు మించిన రాజకీయజ్ఞానం ఆయనకు ఉన్నదని కూడా చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. బహుశా తన పథకాలు, విధానాలను జనంలోకి బాగా తీసుకువెళ్లేందుకు, భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో ఒక నెట్‌వర్క్ కోసం ప్రశాంత్ కిషోర్‌ను ఆయన సంప్రదించి ఉంటారు. అసలు ఒక సిద్ధాంతానికి కట్టుబడని వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకుని ఏం ప్రయోజనం పొందగలదు? బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని రూపొందించి జనంలోకి తీసుకువెళ్లగలిగిన నేతలు ఆ పార్టీకి అవసరం.


విచిత్రమేమంటే కాంగ్రెస్ పార్టీ తాను ఏమిచేయాలో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నది. అంబేడ్కర్, మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు వంటి నేతల్ని బిజెపి స్వీకరించి జనంలో వారి గురించి చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ నిశ్చేష్టగా చూస్తున్నది. స్వాతంత్ర్య అమృతోత్సవాలను కేంద్రం, బిజెపి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా, స్వాతంత్ర్య సమరయోధులను స్మరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. పైగా తమ పార్టీయే స్వాతంత్ర్యాన్ని తెచ్చిందని చెప్పుకుంటుంది. తన మార్కు దేశభక్తిని బిజెపి జనంలోకి ప్రవేశపెడుతున్నా, దేశభక్తి గురించి మాట్లాడే సమర్థమైన నేతలు ఎవరూ కాంగ్రెస్‌లో లేరు, వారసత్వ బలహీనతలనుంచీ, వంధిమాగధత్వం నుంచీ, కోటరీల ద్వారా రాజకీయాలు చేసే స్వార్థపర నేతలనుంచీ, ఒకర్నొకరు వెన్నుపొట్లు పొడుచుకునే సంస్కృతి నుంచీ, పైరవీ కారులనుంచీ, దళారులనుంచీ కాంగ్రెస్ తనను తాను వదుల్చుకోలేకపోతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ సమకాలీనత్వాన్ని కోల్పోతున్నది. వామపక్ష పార్టీల్లాగా గతంలో జీవిస్తోంది. పూర్తిగా తనను ప్రక్షాళనం చేసుకొని, కాయకల్ప చికిత్స జరిపించుకుని జనంలోకి వెళ్లగలిగే నేతల్ని, కార్యకర్తల్ని తయారు చేసుకున్నప్పుడే కాంగ్రెస్ జీవించగలదు. అప్పుడు ఏ ప్రశాంత్ కిషోర్‌ అవసరమూ ఆ పార్టీకి ఉండదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-04-27T09:29:01+05:30 IST