Adhir Ranjan Chowdhury: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ వ్యాఖ్యల దుమారం.. అట్టుడికిన పార్లమెంట్..

ABN , First Publish Date - 2022-07-28T19:23:00+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అవమానించారని బీజేపీ పార్లమెంట్‌లో..

Adhir Ranjan Chowdhury: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ వ్యాఖ్యల దుమారం.. అట్టుడికిన పార్లమెంట్..

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అవమానించారని బీజేపీ పార్లమెంట్‌లో నిరసనకు దిగింది. బీజేపీ నిరసనలతో ఉభయ సభలు అట్టుడికాయి. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అధీర్ రంజన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ వెలుపల, పార్లమెంట్ లోపల కూడా స్మృతి ఇరానీతో పాటు నిర్మలా సీతారామన్, పలువురు బీజేపీ మహిళా ఎంపీలు నిరసనకు దిగారు. ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పదవిని అలంకరించడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.



అయితే.. తన వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. తాను క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితే తలెత్తలేదని, తాను పొరపాటున ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించానని, అధికార పక్షం కావాలనే రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్న కోణంలో అధీర్ రంజన్ చౌదరి మాట్లాడారు. అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించిన వ్యవహారంపై వివాదం రేగడంతో సోనియా గాంధీ కూడా స్పందించారు. ఈ విషయంలో అతను ఇప్పటికే క్షమాపణ చెప్పాడని సోనియా చెప్పడం గమనార్హం. అయితే.. ద్రౌపది ముర్మును అవమానించడానికి సోనియా గాంధీ అనుమతి ఇచ్చినట్టుగా ఆమె సమర్థన ఉందని లోక్‌సభలో నిరసనకు దిగిన సందర్భంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.



రాష్ట్రపతిపై అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పి తీరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ ముఖ్య నేత నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పెను దుమారం రేగడంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొంత అసహనానికి లోనయ్యారు. పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, ఈ వ్యాఖ్యలు చేసిన అధీర్ రంజన్ చౌదరితో సోనియా గాంధీ అత్యవసరంగా సమావేశం అయ్యారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ ఇచ్చుకునేందుకు సభలో తనకు అవకాశం ఇవ్వాలని అధీర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు అభ్యర్థిస్తూ స్పీకర్‌కు లేఖ కూడా రాశారు. రాష్ట్రపతి ముర్ముపై అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉండగా.. గురువారం రాజ్యసభ నుంచి ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు ఆప్ ఎంపీలపై, ఒక ఇండిపెండెంట్ ఎంపీపై ఈ వారంలో మిగిలిన రోజులు సభకు రాకుండా సస్పెన్షన్ వేటు పడింది.

Updated Date - 2022-07-28T19:23:00+05:30 IST