Apology: రాష్ట్రపతికి క్షమాపణ చెప్పిన అధీర్ రంజన్ చౌదరి

ABN , First Publish Date - 2022-07-30T01:15:12+05:30 IST

'రాష్ట్రపత్ని' వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారంనాడు ఈ మేరకు ఆయన లేఖ ..

Apology: రాష్ట్రపతికి క్షమాపణ చెప్పిన అధీర్ రంజన్ చౌదరి

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmug)ను 'రాష్ట్రపత్ని' (Rashtrapatni) అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) క్షమాపణలు (Apology) చెప్పారు. రాష్ట్రపతికి శుక్రవారంనాడు ఈ మేరకు ఆయన లేఖ రాశారు. మీరు చేపట్టిన అత్యున్నత పదవి గురించి చెప్పాలనుకుని పొరపాటున నోరుజారానని, ఇందుకు తాను చింతిస్తున్నానని ఆ లేఖలో అధీర్ పేర్కొన్నారు.


దీనికి ముందు, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ బుధవారం ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌ వద్ద కాం గ్రెస్‌ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు అధీర్‌ రంజన్‌ చౌదరి బదులిస్తూ...'' మేము భారత రాష్ట్రపతిని కలవడానికి వెళ్తున్నాం, కాదుకాదు, రాష్ట్రపత్ని.. అందరికీ'' అన్నారు. తర్వాత తాను చేసింది తీవ్ర వ్యాఖ్య అని గుర్తించి దాన్ని ప్రసారం చేయొద్దని విలేకరులను కోరారు.


అట్టుడికిన పార్లమెంటు..

కాగా, ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటూ అధీర్ రంజన్ సంబోధించడంతో పార్లమెంటు ఉభయసభలూ అట్టుడికాయి. పొరపాటున నోరిజారినట్టు అధీర్ రంజన్ వివరణ ఇవ్వగా, సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. పేద కుటుంబానికి చెందిన గిరిజన మహిళ చరిత్ర సృష్టించడాన్ని కాంగ్రెస్ నిరంతరం తక్కువ చేసి మాట్లాడుతోందని ఆమె విమర్శించారు. అతున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతిని అవమానించేందుకు సోనియా అనుమతినిచ్చారని, ఒక పేద మహిళను అవమానించేందుకు ఆమె ప్రేరేపించారని, ప్రతి భారతీయ పౌరుడిని అవమానించేందుకు వీలు కల్పించారని స్మృతిఇరానీ వేలెత్తి చూపించి మాట్లాడడం సోనియాకు ఆగ్రహం తెప్పించింది. ఓ దశలో ''మీరు నాతో మాట్లాడకండి'' అంటూ స్మృతి ఇరానీని ఉద్దేశించి సోనియా అన్నారు. సోనియాను క్రూరంగా వేళాకోళం చేయడం, మాటలతో దాడిచేయడం, భౌతికంగా బెదిరించడం బీజేపీ ఎంపీల మూక మనస్తత్వానికి నిదర్శనమని కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ అన్నారు. ఈ క్రమంలో అధీర్ రంజన్ శుక్రవారంనాడు నేరుగా రాష్ట్రపతికి క్షమాపణ లేఖ రాశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2022-07-30T01:15:12+05:30 IST