Presidential Polls: ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత పరుష వ్యాఖ్యలు... బీజేపీ ఆగ్రహం...

ABN , First Publish Date - 2022-07-13T22:01:36+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అజోయ్

Presidential Polls: ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత పరుష వ్యాఖ్యలు... బీజేపీ ఆగ్రహం...

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల (Presidential Polls) కోసం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము (Draupadi Murmu)పై కాంగ్రెస్ (Congress) నేత అజోయ్ కుమార్ (Ajoy Kumar) పరుష వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ (BJP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యావత్తు గిరిజన (Tribal) సమాజానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ద్రౌపది క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగారని, అజోయ్ కుమార్ వ్యాఖ్యలు ఆమెకు, ఆదివాసీ సమాజానికి తీవ్ర అవమానకరమని పేర్కొంది. 


జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే (NDA) అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ, ద్రౌపది ముర్ము భారత దేశపు అత్యంత దుష్ట భావజాలానికి ప్రతినిధి అని, ఆమెను ఆదివాసీలకు చిహ్నంగా పరిగణించకూడదని అన్నారు. ‘‘ఇది ద్రౌపది ముర్ము గురించి కాదు. యశ్వంత్ సిన్హా కూడా చాలా మంచి అభ్యర్థి. ముర్ము కూడా మర్యాదస్థురాలే. కానీ ఆమె భారత దేశపు అత్యంత దుష్ట భావజాలానికి ప్రతినిధి, మనం ఆమెను ఆదివాసీలకు చిహ్నంగా చేయకూడదు. మనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉన్నారు. హత్రాస్ సంఘటన జరిగింది. ఆయన కనీసం ఒక మాట అయినా మాట్లాడారా? షెడ్యూల్డు కులాల పరిస్థితి దయనీయంగా మారింది’’ అని చెప్పారు. 


అజోయ్ కుమార్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ఆదివాసీ సమాజానికి చెందిన ఓ మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించిన చర్య గిరిజనులను సాధికారులను చేస్తుంది. కాంగ్రెస్ నేత అసోసియేషన్ వల్ల ఆమె చెడ్డవారని అంటున్నారన్నారు. కేవలం ఆమె గిరిజన వ్యక్తి అయినందుకేనని, ఇది సిగ్గు చేటు అని తెలిపారు. 


బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఓ వార్తా సంస్థతో బుధవారం మాట్లాడుతూ, ద్రౌపది ముర్ము క్షేత్ర స్థాయి నుంచి ఎదిగారన్నారు. అజోయ్ కుమార్ వ్యాఖ్యలు ఆమెను కించపరిచేవిధంగా ఉన్నాయన్నారు. పరిస్థితులతో పోరాడుతూ, క్షేత్ర స్థాయి నుంచి ఎన్నికల్లో గెలుస్తూ, ఎమ్మెల్యేగా సేవలందించి, ఉత్తమ ఎమ్మెల్యేగా పురస్కారం పొంది, అవినీతి మచ్చ లేని వ్యక్తి భావజాలంలో చెడు ఏముంటుందని ప్రశ్నించారు. దానిలో చెడు ఏమి ఉందన్నారు. 


కాంగ్రెస్, మరీ ముఖ్యంగా అజోయ్ కుమార్ ఉపయోగించిన భాష ఆమెకు మాత్రమే కాకుండా, యావత్తు ఆదివాసీలకు అవమానకరమని ఆరోపించారు. ద్రౌపది ముర్ము భారత దేశపు అత్యంత దుష్ట భావజాలానికి ప్రతినిధి అని, ఆమెను ఆదివాసీ సమాజానికి చిహ్నంగా చూడకూడదని అజోయ్ వ్యాఖ్యానించడం ఆమెకు, యావత్తు ఆదివాసీ సమాజానికి అవమానకరమని చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు జూలై 21న వెలువడతాయి. ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధిస్తే మన దేశంలో రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన నేతగా ఘనత సాధిస్తారు. అదేవిధంగా రాష్ట్రపతిగా ఎన్నికైన మహిళల్లో రెండోవారు అవుతారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆమె చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో చదువుకున్నారు. 


Updated Date - 2022-07-13T22:01:36+05:30 IST