కాంగ్రెస్‌కు బిగ్ షాక్..ఆర్‌పీఎన్ సింగ్ రాజీనామా

ABN , First Publish Date - 2022-01-25T19:28:19+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఇటీవలే పార్టీకి జితిన్ ప్రసాద రాజీనామా చేసిన షాక్ నుంచి తేరుకోకుండానే..

కాంగ్రెస్‌కు బిగ్ షాక్..ఆర్‌పీఎన్ సింగ్ రాజీనామా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఇటీవలే పార్టీకి జితిన్ ప్రసాద రాజీనామా చేసిన షాక్ నుంచి తేరుకోకుండానే మరో ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తన రాజీనామా లేఖను పంపారు. ఈరోజే ఆయన బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు ఆ పార్టీ ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని పడ్రౌనా నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి స్వామి ప్రసాద్ మౌర్యపై ఆయనను బీజేపీ నిలబెట్టే అవకాశాలున్నాయని కూడా వారు అంటున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కేంద్రంలో పదవి పట్ల ఆయన ఆసక్తిగా ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.


''రిపబ్లిక్ డే ఫార్మెషన్ రోజే నేను నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. జై హింద్'' అంటూ ఆర్‌పీఎన్ సింగ్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, కనీసం తన సన్నిహితులకు కూడా యూపీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఇవ్వలేదంటూ మనస్తాపానికి గురయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌పీఎన్ సింగ్ 1996 నుంచి 2007 వరకూ పడ్రౌనా ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం కుషీనగర్ నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఆసక్తికరంగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 30 మంది స్టార్ క్యాంపెయినర్లలో ఆర్‌పీఎన్ సింగ్ కూడా ఉన్నారు.

Updated Date - 2022-01-25T19:28:19+05:30 IST