Rahul gandhi పబ్‌కు వెళ్లారన్న ప్రచారంపై జగ్గారెడ్డి ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-05-03T18:50:46+05:30 IST

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పబ్‌కు వెళ్లారని జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.

Rahul gandhi పబ్‌కు వెళ్లారన్న ప్రచారంపై జగ్గారెడ్డి ఏమన్నారంటే...

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పబ్‌కు వెళ్లారని జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఫంక్షన్‌కు వెళ్ళిన చోట ఏముందో రాహుల్ గాంధీకి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అక్కడ జరిగేదానికి రాహుల్ గాంధీకి ఏం సంబంధం అని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చిల్లరగాల్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ ఫంక్షన్‌కు వెళ్ళిన వీడియోలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పెళ్లికి వెళ్లిన వీడియోని చూపిస్తూ రాజకీయం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు మానాలని అన్నారు. ‘‘మీ పార్టీల నేతలు రాత్రి పూట ఎక్కడికి వెళుతున్నారో బయట పెట్టమంటారా?’’ అంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. 


ఈ నెల 6న జరిగే రైతు సంఘర్షణ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. వరంగల్ సభలో రైతు సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేసే అభివృద్ధి పథకాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతారన్నారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని రాహుల్ నిలదిస్తారని అన్నారు. ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. అసైన్డ్ భూములను రైతుల దగ్గర నుండి ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. స్వతంత్ర సమరయోధులు, ఎక్స్ సర్వీస్ మెన్‌లకు ఇచ్చిన భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందన్నారు. నెహ్రు కాలం నుండి కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేస్తూ వస్తోందని ఆయన చెప్పారు.


కాంగ్రెస్ దేశానికి ఏం చేసింది అనేవారు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టినదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ అని ఎన్నికల హామీ ఇచ్చి నేటికి రుణమాఫీ చేయని దద్దమ్మ ప్రభుత్వం టీఆర్ఎస్ అని విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పాలన మొత్తం గ్రాఫిక్స్ మయమన్నారు. అభివృద్ధి తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకునే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరగాలంటే కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Read more