అధికారంలోకి వచ్చాక తోలు తీస్తాం: Jagga reddy

ABN , First Publish Date - 2022-04-18T19:33:19+05:30 IST

టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రిసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

అధికారంలోకి వచ్చాక తోలు తీస్తాం: Jagga reddy

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్నారు. కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు గుండాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ప్రతిపక్ష నేతలకు సహకరించడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై పీడీ యాక్ట్‌లు పెడుతున్నారని ఆగ్రహించారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త చనిపోతూ మంత్రి పువ్వాడ అజయ్‌పై మరణ వాంగ్మూలం ఇచ్చినా ఆ మంత్రి పై చర్యలు లేవన్నారు. మరణ వాంగ్మూలం ఇచ్చినా.. అధికారులు, మంత్రి పై చర్యలు తీసుకోకపోవడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యమేంటని ఆయన ప్రశ్నించారు.


అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తోలు తీస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి అధికారులు, మంత్రులపై వడ్డీతో సహా చర్యలు తీసుకుంటామన్నారు. సినిమాల్లో మాదిరి నడిరోడ్లపై హత్యలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని నిలదీశారు. టీఆర్ఎస్ నేతల తీరుతో అమాయక ప్రజలు చనిపోతున్నారని కాంగ్రెస్ నేత అన్నారు. బీజేపీ కార్యకర్త చనిపోవడాన్ని రాజకీయంగా వాడుకోకుండా.. ఆ కుటుంబాన్ని ఆదుకొని మంత్రిని బర్తరఫ్ చేసే వరకు బండి సంజయ్ పోరాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులపైన అధికారులు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారన్నారు. నేరాలు గోరాల రాష్ట్రంగా కేసీఆర్ పాలన మారిందని వ్యాఖ్యానించారు. ఇకనైనా సీఎం కేసీఆర్ మేల్కొని లా అండ్ ఆర్డర్‌ను సరిచేయాలని జగ్గారెడ్డి హితవుపలికారు. 

Updated Date - 2022-04-18T19:33:19+05:30 IST