Gyanvapi Shivling : జ్ఞానవాపి శివలింగంపై మా పార్టీ నేతల వ్యాఖ్యలు సరికాదు : కాంగ్రెస్ నేత ప్రమోద్

ABN , First Publish Date - 2022-05-24T01:18:45+05:30 IST

శివలింగాన్ని తమాషా అనకూడదని కాంగ్రెస్ నేత, ఆధ్యాత్మిక

Gyanvapi Shivling : జ్ఞానవాపి శివలింగంపై మా పార్టీ నేతల వ్యాఖ్యలు సరికాదు : కాంగ్రెస్ నేత ప్రమోద్

న్యూఢిల్లీ : శివలింగాన్ని తమాషా అనకూడదని కాంగ్రెస్ నేత, ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అన్నారు. జ్ఞానవాపిలో శివలింగం ఉన్నట్లు వచ్చిన వార్తలపై ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను ఖండించారు.  దురదృష్టవశాత్తూ, కొందరు కాంగ్రెస్ నేతలు తమను తాము గొప్ప ఉదారవాదులుగా చూపించుకునేందుకు శివలింగాన్ని పరిహసిస్తున్నారని చెప్పారు. 


ఆచార్య ప్రమోద్ సోమవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) నేత అఖిలేశ్ యాదవ్  (Akhilesh Yadav) అయినా, రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ (Ashik Gehlot) అయినా, శివలింగాన్ని తమాషా అని అనకూడదని అన్నారు. ఇది భక్తివిశ్వాసాలకు సంబంధించిన విషయమని తెలిపారు.


ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం (Shivling) కనిపించినట్లు వచ్చిన వార్తలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, జ్ఞానవాపి మసీదు విషయంలో బీజేపీ సరికొత్త నాటకాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్యం ముసుగు తగిలించుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. వారి విధానాలు, సిద్ధాంతాలు, కార్యక్రమాలు ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాయన్నారు. గెహ్లాట్ వ్యాఖ్యలపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా స్పందిస్తూ, కాంగ్రెస్ మరోసారి హిందువుల భక్తివిశ్వాసాలు, సంప్రదాయాలను ఎగతాళి చేస్తోందన్నారు 


సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, హిందూ మతంలో ఓ రాయిని ఎక్కడైనా పెట్టి, కాషాయ జెండాను ఎగురవేస్తే అదే ఒక దేవాలయం అయిపోతుందన్నారు. రాత్రివేళల్లో విగ్రహాలను పెట్టే కాలం ఒకటి ఉండేదన్నారు. బీజేపీ ఏదైనా చేయగలదని, దేన్ని అయినా చేయించగలదని అన్నారు. దీనిపై బీజేపీ (BJP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన దిష్టి బొమ్మను దహనం చేసి, నిరసన తెలిపింది. 


Updated Date - 2022-05-24T01:18:45+05:30 IST