Congress Rally : విద్వేషం పెరుగుతోంది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-09-04T20:43:51+05:30 IST

దేశంలో బీజేపీ (BJP) నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి విద్వేషం

Congress Rally : విద్వేషం పెరుగుతోంది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : దేశంలో బీజేపీ (BJP) నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి విద్వేషం పెరుగుతోందని (Hate Rising) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దుయ్యబట్టారు. ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయని ఆరోపించారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆ పార్టీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 


మహంగాయీ పర్ హల్లా బోల్ పేరుతో జరిగిన ఈ సభలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రజలు తమ భవిష్యత్తు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ఆందోళన చెందుతున్నారని, ఆ ఆందోళన వారిని విద్వేషం వైపు మళ్లిస్తోందని తెలిపారు. బీజేపీ, ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయన్నారు. 


కేవలం ఇద్దరు వ్యాపారులు మాత్రమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్నారని ఆరోపించారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ ఆ ఇద్దరే కనిపిస్తున్నారన్నారు. ఇద్దరికి లబ్ధి చేకూర్చాలన్నదే మోదీ సిద్ధాంతమన్నారు. దేశ ప్రగతి వల్ల అందరూ ప్రయోజనం పొందాలనేది తమ సిద్దాంతమని వివరించారు. 


ధరలు ఇంత తీవ్రంగా ఎన్నడూ పెరగలేదన్నారు. సామాన్యులు చాలా కష్టాల్లో ఉన్నారన్నారు. ఈ విషయాలతోపాటు చైనాతో ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. 


నరేంద్ర మోదీ మన దేశాన్ని వెనుకకు తీసుకెళ్తున్నారని, విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల పాకిస్థాన్, చైనా లాభపడుతున్నాయని తెలిపారు. గడచిన ఎనిమిదేళ్ళలో మోదీ భారత దేశాన్ని బలహీనపరిచారని దుయ్యబట్టారు. 


భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ సెప్టెంబరు 7నుంచి భారత్ జోడో యాత్రను నిర్వహిస్తోంది. కన్యా కుమారి నుంచి కశ్మీరు వరకు సాగే ఈ యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత సామరస్యాన్ని పెంచడం వంటి అంశాలపై ఆయన మాట్లాడతారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను కలవడానికి ఈ యాత్ర దోహదపడుతుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 


Updated Date - 2022-09-04T20:43:51+05:30 IST