రాజ్యాంగ విలువల విధ్వంసం : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-04-20T21:11:29+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణలను

రాజ్యాంగ విలువల విధ్వంసం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశ రాజ్యాంగ విలువల విధ్వంసం జరుగుతోందని బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో మండిపడ్డారు. పేదలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. దీనికి బదులుగా బీజేపీ తన మనసులోని విద్వేషాన్ని బుల్డోజ్ చేసుకోవాలని హితవు పలికారు. భారత రాజ్యాంగాన్ని ఓ బుల్డోజర్ ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం వచ్చే విధంగా ఓ ఫొటోను ఈ ట్వీట్‌కు జత చేశారు. రాజ్యాంగ ప్రవేశిక, బుల్డోజర్ ఫొటోలను పెట్టారు. 


ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ (ఎంసీడీ) బుధవారం ఉదయం జహంగీర్‌పురిలోని చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అయితే ఈ కార్యక్రమాన్ని నిలిపేయాలని సుప్రీంకోర్టు ఎంసీడీని ఆదేశించింది. యథాతథ స్థితిని కొనసాగించాలని, తదుపరి విచారణ గురువారం జరుగుతుందని పేర్కొంది. 


ఈ ఆక్రమణలను తొలగించడం కోసం నగర పాలక సంస్థ అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని ఆపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం ట్విటర్ వేదికగా వేర్వేరుగా డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, విద్వేషంతో కూడిన బుల్డోజర్స్‌ను ఆపాలని, పవర్ ప్లాంట్స్‌ను స్విచాన్ చేయాలని డిమాండ్ చేశారు. 




Updated Date - 2022-04-20T21:11:29+05:30 IST