బీజేపీ నేతల పాట్లు చూస్తుంటే జాలేస్తుంది: Sunkara

ABN , First Publish Date - 2021-10-27T14:35:59+05:30 IST

బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల పాట్లు చూస్తుంటే జాలేస్తోందని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు.

బీజేపీ నేతల పాట్లు చూస్తుంటే జాలేస్తుంది: Sunkara

విజయవాడ:  బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల పాట్లు చూస్తుంటే జాలేస్తోందని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఏదో చేసిందని చెప్పడానికి బీజేపీ నాయకులు నానా తంటాలు పడుతున్నారన్నారు. ప్రజలను నమ్మించకపోతే ఒకవైపు అధిష్టానం నుంచి చివాట్లు, చెబుతున్న అబద్ధాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని మరొక భయం అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నేడు ఇబ్బందుల్లో ఉందంటే దానికి మొదటి పాపం బీజేపీనే అని మండిపడ్డారు. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రజలను ప్రతిసారి నమ్మించి గొంతుకోస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రజలకు సమాధానం చెప్పాలని సుంకర డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ, ప్రత్యేక హోదాపై బీజేపీ స్టాండ్ ఏంటి  అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఏపీ ప్రజల ఆశలను చిదిమేశారన్నారు. తిరుమల శ్రీనివాసుని చెంత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది మీరు కదా అని నిలదీశారు. ‘‘అమ్మ....పురంధేశ్వరి ఏపీకి ప్రత్యేక హోదా ఎక్కడని మీ ప్రధానిని ప్రశ్నించు తల్లి’’ అని అన్నారు. వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడం తప్పని తమరైనా తమ ప్రధానికి చెప్పండి సోము వీర్రాజు అని అన్నారు.


ఏపీ నష్టపోకూడదని ఏపీ అభివృద్ధికి కావాల్సిన అన్ని అంశాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టిందని తెలిపారు. అధికారం కోసం బీజేపీ నేతలు ఏం చేయడానికైనా వెనుకాడరన్నారు. బీజేపీ, వైసీపీ చేస్తున్న అరాచకాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ తానా అంటే వైసీపీ తందనా అంటుందని...ఇద్దరిది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు. కేంద్రంలో ఇద్దరు కలిసి ఉంటూ రాష్ట్రంలో మాత్రం విమర్శలు చేసుకుంటున్నారన్నారు. బీజేపీ తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో  ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపర్చాలని సుంకర పద్మశ్రీ కోరారు. 

Updated Date - 2021-10-27T14:35:59+05:30 IST