వైసీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి: Tulasireddy

ABN , First Publish Date - 2022-06-17T17:47:20+05:30 IST

వైసీపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీనించాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

వైసీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి: Tulasireddy

అమరావతి: వైసీపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీనించాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి(Tulasi reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.... ఎక్కడో ఎందుకు? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. నిన్న వేంపల్లె పట్టణంలో ఫర్హాన అనే 28 ఏళ్ల వివాహిత ఇంటిలోనే గొంతు కోసి హత్య చేయబడిందని తెలిపారు. 2020లో పులివెందుల పట్టణానికి చెందిన శివరాని, వీరమ్మ, పెద్ద కుడాల గ్రామానికి చెందిన నాగమ్మ హత్య కావించబడ్డారని అన్నారు. 2021లో నల్లపురెడ్డి పల్లెకు చెందిన పార్థ సారథి రెడ్డి, అగడూరుకు చెందిన కులాయప్ప, కోమనూతల సర్పంచ్ గడ్డం మునెప్ప హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది. రక్షణ కల్పించండి అని ముఖ్యమంత్రి గారి చెల్లెలు డాక్టర్ సునీత రెడ్డి కడప ఎస్పీకి లేఖ రాసిందని అన్నారు.


వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా మారిన దస్తగిరి తన ప్రాణాలను కాపాడండి అని మొర పెట్టుకుంటున్నాడని తెలిపారు. నియోజకవర్గంలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారని,  దేవతావిగ్రహాలకు రక్షణ లేదని వ్యాఖ్యానించారు. నియోజవర్గంలో చీనీ చెట్లు, అరటి చెట్లు తదితర పండ్ల తోటలను నరికి ప్రత్యర్ధుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే దుష్ట సంస్కృతి పెచ్చు మీరుతోందని ఆందోళన చెందారు. సొంత నియోజవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్ర పరిస్థితి చెప్పతరమా! అంటూ తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-06-17T17:47:20+05:30 IST