వైసీపీ, టీడీపీ సామాజిక కోణం గురించి మాట్లాడడం హాస్యాస్పదం: Tulasireddy

ABN , First Publish Date - 2022-07-16T17:28:41+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు సామాజిక కోణం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

వైసీపీ, టీడీపీ సామాజిక కోణం గురించి మాట్లాడడం హాస్యాస్పదం: Tulasireddy

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ(YCP), టీడీపీ(TDP) పార్టీలు సామాజిక కోణం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి(Tulasi reddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ(BJP) అభ్యర్థి గిరిజనురాలు కాబట్టి మద్దతు ఇస్తున్నామని చెప్పడం కేవలం సాకు మాత్రమే అని తెలిపారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే కల్లు కోసం కాదు, దూడ గడ్డి కోసం అన్నట్లుంది ఈ పార్టీల వైఖరి అని వ్యాఖ్యానించారు. 2012లో జరగిన 14వ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ(Pranab mukharji), పిఏ సంగ్మా(PA sangma)ల మధ్య పోటీ జరిగిందని, సంగ్మా మేఘాలయకు చెందిన గిరిజనుడని తెలిపారు. ఆ ఎన్నికల్లో గిరిజనుడు అయిన సంగ్మాకు కాకుండా ప్రణబ్ ముఖర్జీకి జగన్(Jagan) మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.


గిరిజనుడు అయిన సంగ్మాకు మద్దతు ఇవ్వకుండా టీడీపీ ఎన్నికలను బహిష్కరించినందన్నారు. ఆనాడు ఈ రెండు పార్టీలకు సామాజిక న్యాయం ఏమైందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు(Chandrababu) చేసిన ధర్మ పోరాటం ఏమైందని నిలదీశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్న జగన్ గర్జనలు ఏమయ్యాయని అడిగారు. ఈ రెండు పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టాయని ఆరోపించారు. రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి బీజేపీ అని... అటువంటి బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసీపీ, టీడీపీలు మరింత ద్రోహులని మండిపడ్డారు. దుష్టత్రయ పార్టీలైన బీజేపీ, వైసీపీ, టీడీపీలను రాష్ట్ర పొలిమేర్ల నుండి తరిమికొడితే తప్ప రాష్ట్రం బాగుపడదని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 





Updated Date - 2022-07-16T17:28:41+05:30 IST