Tulasireddy: ఏపీలో ఆరోగ్యరంగానికి అనారోగ్యం పట్టుకుంది

ABN , First Publish Date - 2022-09-01T19:17:20+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి అనారోగ్యం పట్టుకుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Tulasireddy: ఏపీలో ఆరోగ్యరంగానికి అనారోగ్యం పట్టుకుంది

అమరావతి: వైసీపీ (YCP) పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి అనారోగ్యం పట్టుకుందని కాంగ్రెస్ (Congress) నేత తులసిరెడ్డి (Tulasireddy) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... చాలామటుకు ప్రభుత్వ ఆసుపత్రు (Government hospitals)ల్లో డాక్టర్ల కొరత, పారామేడికల్ సిబ్బంది కొరత, మందుల కొరత, రక్తపు నిల్వల కొరత ఉందన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో వేంపల్లెలో 50 పడకల ఆసుపత్రిలో 11 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని.. అందులో ఒకరు ట్రైనింగ్‌లో ఉన్నారని అన్నారు. పర్యవసానంగా పోస్టుమార్టం గానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గానీ చేసే పరిస్థితి లేదని తెలిపారు. ముఖ్యమంత్రి (CM Jagan mohan reddy) సొంతూరు పులివెందులలో 100 పడకల ఆసుపత్రిలో 23 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే ఉన్నారన్నారు. ముగ్గురు గైనకాలజిస్టులకు గాను ఒక్కరు కూడా లేదని ఆయన అన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందన్నారు. ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ అయ్యిందని తెలిపారు. పెండింగ్ బిల్లులు కారణంగా చాలా నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ (Aarogya sri) కింద అడ్మిట్ చేసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితే ఇలా ఉంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఆగస్టు 15 నుండి అమలు చేస్తామని ముఖ్యంత్రి ఆర్భాటంగా చెప్పి చతికిలపడటం జరిగిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆరోగ్య రంగం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి సిబ్బంది, మందులు, రక్తపు నిల్వలు కొరత లేకుండా చూడాలని తులసిరెడ్డి (Congress leader) డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-01T19:17:20+05:30 IST