Bihar cabinet: కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు

ABN , First Publish Date - 2022-08-10T20:45:28+05:30 IST

నితీష్ కుమార్ సారథ్యంలోని మహాగఠ్బంధన్ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు...

Bihar cabinet: కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు

పాట్నా: నితీష్ కుమార్ సారథ్యంలోని మహాగఠ్బంధన్ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీతో సంబంధాలు తెంచుకున్న నితీష్ ఆ వెంటనే ఆర్జేడీ కూటమితో చేతులు కలిపి మహాగఠ్బంధన్ ప్రభుత్వాన్ని బుధవారంనాడు ఏర్పాటు చేశారు. సీఎంగా నితీష్, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ శాసనసభా పక్ష నేత తేజస్వి యాదవ్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్  వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రివర్గ విస్తరణను త్వరలోనే నితీష్ చేపట్టనున్నారు.


కాగా, నితీష్ క్యాబినెట్‌లో నాలుగు మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవిని కాంగ్రెస్ ఆశించింది. అయితే, స్పీకర్ పదవిని ఇచ్చేందుకు నితీష్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. దీంతో ఆర్జేడీకి అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కనుంది. మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్ఏఎంకు ఒక మంత్రి పదవి దక్కనుంది. జేడీయూ దాదాపు గత మంత్రివర్గంలో ఉన్న మంత్రులనే కొనసాగించే అవకాశాలున్నాయి. నితీష్ వద్దే హోం శాఖ ఉండనుంది. గత ప్రభుత్వంలో బీజేపీ నిర్వహించిన మంత్రి పదవులు ఆర్జేడీకి దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బీహార్‌ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా, జేడీయూకు 43, ఆర్జేడీ 79, సీపీఐ (ఎంఎల్)కు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Updated Date - 2022-08-10T20:45:28+05:30 IST