Bharat Jodo Yatra: ఎన్నికల వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాక్

ABN , First Publish Date - 2022-10-05T02:47:55+05:30 IST

గాంధీనగర్: ఎన్నికల వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎమ్మెల్యే షాకిచ్చారు.

Bharat Jodo Yatra: ఎన్నికల వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాక్

గాంధీనగర్: ఎన్నికల వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎమ్మెల్యే షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విసావదార్ ఎమ్మెల్యే హర్షద్ రిబాడియా ప్రకటించారు. తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌ నిమాబెన్ ఆచార్యకు సమర్పించారు. ఆయన రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. హర్షద్ రిబాడియా బీజేపీలో చేరతారని తెలుస్తోంది. 


అంతకుముందు రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షుడు చేతన్ రావల్ కూడా రాజీనామా చేశారు. అయితే చేతన్ రావల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.  


గుజరాత్‌లో ఎన్నికల వేళ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. 


వారం క్రితమే హిమాచల్ ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. హర్ష్ మహాజన్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ సీఎం వీరభద్రసింగ్‌కు ప్రధాన అనుచరుడు కూడా. కాంగ్రెస్ పార్టీకి సరైన దిశానిర్దేశం లేదని, హిమాచల్ ప్రదేశ్‌లో హస్తం పార్టీకి సరైన నాయకుడే లేడని హర్ష్ మహాజన్ విమర్శించారు. రాహుల్ గాంధీ కారణంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. 


ఓ పక్క భారత్ జోడో అంటూ రాహుల్ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆ పార్టీకి బైబై చెబుతున్నారు. ఇటీవలే గోవాలో 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేదు అనుభవాన్ని మిగుల్చుతున్నాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ సహా అగ్రనాయకత్వం కలలు కంటుంటే కీలక నేతలంతా హస్తం పార్టీని వీడిపోతున్నారు.


అతి త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రెండు చోట్లా మరోసారి కమలం వికసిస్తుందని ఒపినీయన్ పోల్స్ చెబుతున్నాయి. ఏబీపీ న్యూస్‌-సీఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం బీజేపీ గుజరాత్‌లో ఏడోసారి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌ అసెంబ్లీకి ఉన్న 182 సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రాగా... ఈసారి 135 నుంచి 143 వరకు సీట్లు రావొచ్చని పోల్‌ పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 వరకు సీట్లు దక్కవచ్చని ఒపీనియన్ పోల్ అంచనావేసింది. అలాగే 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 37-45 సీట్లలో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ తెలిపింది. 


గుజరాత్‌లో అహ్మద్ పటేల్ మరణంతో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీనికి తోడు గుజరాత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్ధిక్ పటేల్ బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌కు దెబ్బమీదదెబ్బ తగిలింది. పార్టీకి సమర్థ నాయకుడెవరూ లేకపోవడం హస్తం పార్టీ నేతలను కలవరపెడుతోంది. అసలే కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన సవాల్‌గా మారింది. ఇప్పటికే ఆరుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బెడద కాస్త ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీలు చీల్చనున్నాయి. ఇది కూడా కమలనాథులకు కలిసి వస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా నుంచి అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారింది. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఊహించనంత మద్దతు లభిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. 


భారత్ జోడో యాత్ర ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారుకు సమరభేరీ మోగించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్‌లోనూ పాదయాత్ర కొనసాగించనున్నారు. తన పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేసుకుని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన వైపునకు తిప్పుకోగలిగితే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా నిలబడుతుంది. రాహుల్ పాదయాత్ర గుజరాత్‌లో తప్పకుండా ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి బదులుగా కాంగ్రెస్ బీజేపీకి గట్టి సవాలు విసరగలుగుతుంది. 


గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో కీలక నేతలంతా రాజీనామాల బాట పట్టడంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నష్టనివారణ చర్యలు తీసుకోకపోతే ఎన్నికల నాటికి పార్టీ మరింత దెబ్బతింటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

Updated Date - 2022-10-05T02:47:55+05:30 IST