Haryana: కాంగ్రెస్‌కు కుల్‌దీప్ బిష్ణోయ్ రాజీనామా.. బీజేపీలో చేరికకు ముహూర్తం

ABN , First Publish Date - 2022-08-03T20:22:50+05:30 IST

Haryana: కాంగ్రెస్‌కు కుల్‌దీప్ బిష్ణోయ్ రాజీనామా.. బీజేపీలో చేరికకు ముహూర్తం..

Haryana: కాంగ్రెస్‌కు కుల్‌దీప్ బిష్ణోయ్ రాజీనామా.. బీజేపీలో చేరికకు ముహూర్తం

ఛండీగఢ్: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ హర్యానా అసెంబ్లీకి బుధవారంనాడు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తాకు అందజేశారు. గురువారంనాడు ఆయన బీజేపీలో చేరనున్నారు. ఆయన రాజీనామాతో ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిసార్ జిల్లా అదంపూర్ నియోజకవర్గాంలో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. రాజ్యసభ ఉపఎన్నికల్లో బిష్ణోయ్ క్రాస్ ఓటింగ్ చేయడంతో ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ తొలగించింది.


కాగా, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా అనంతరం  బిష్ణోయ్ మాట్లాడుతూ, తనను రాజీనామా చేయాలని బీఎస్ హుడా సవాలు చేశారని, ఆ ఛాలెంజ్‌ను తాను స్వీకరించానని చెప్పారు. ఇప్పుడు తాను ఆయనకు (హుడా) సవాల్ చేస్తున్నానని, ఆదంపూర్ నియోజకవర్గం నుంచి తనపై పోటీచేసి గెలవాలని అన్నారు.


ఈ ఏడాది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పునర్వవస్థీకరణలో భాగంగా హర్యానా యూనిట్ అధ్యక్ష పదవిని బిష్ణోయ్ ఆశించారు. అందుకు అధిష్ఠాన విముఖత చూపడంతో ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ నేపథ్యంలో మంగళవారంనాడు తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసిన బిష్ణోయ్...బీజేపీలో చేరే విషయమై వారి సూచనలు తీసుకున్నారు. అనంతరం పార్టీతో తెగతెంపులు చేసుకునే సమయం ఆసన్నమైందంటూ ఆయన ప్రకటన చేశారు. ఆదంపూర్ నియోజవకవర్గం ప్రజల కోరిక మేరకు ఆగస్టు 3న ఛండీగడ్ వెళ్లి తన రాజీనామాను సమర్పిస్తానని, 4న తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరుతానని ప్రకటించారు. ఆదంపూర్ ప్రజలు తన కుటుంబంపై చూపిన ఆదరణ ఇంకెక్కడా దొరకదని, ఆ ప్రాంత అభివృద్ధికి మరోసారి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. తాను కొత్త రాజకీయ యాత్ర ప్రారంభిస్తున్నానని, దీనిపై తన హితులను, సన్నిహితులను సంప్రదించానని, ఆదంపూర్ ప్రజలకు తానెల్లప్పుడూ రుణపడి ఉంటానని మంగళవారంనాడు హిందీలో ఆయన ఒక ట్వీట్ చేశారు.


బీజేపీ కేంద్ర నేతలతో మంతనాలు

బిష్ణోయ్ ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలను కలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్ నడ్డా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తదితరులతో సమావేశమయ్యారు. వారం రోజుల క్రితం నడ్డాను, ఖత్తార్‌ను ఢిల్లీలో కలుసుకుని రాజకీయ అంశాలపై చర్చించారు. జూలై 10న అమిత్‌షా, నడ్డాలను ఢిల్లీలో కలుసుకున్నారు. అనంతరం బీజేపీ అగ్రనేతలపై బిష్ణోయ్ ప్రశంసలు కురిపించారు.


బిష్ణోయ్ తండ్రి భజన్ లాల్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ (హెచ్‌జేసీ) పార్టీని 2007లో ప్రారంభించారు. దీనికి ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి భూపిందర్ సింగ్ హుడాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీంతో భజన్ లాల్ సొంతంగా హెచ్‌జేసీ పార్టీని ఏర్పాటు చేసి బీజేపీ, మరో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని 2014 లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా నుంచి పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలనుకున్నప్పటికీ పొత్తు కుదరలేదు. ఆరేళ్ల క్రితం బిష్ణోయ్ కాంగ్రెస్‌లో చేరారు. అయితే అప్పట్నించి బిష్ణోయ్, హుడా మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. ఈ క్రమంలో గత నెలలో పార్టీ పదవుల నుంచి బిష్ణోయ్‌ను కాంగ్రెస్ తొలగించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా బిష్ణోయ్ పనిచేశారు.

Updated Date - 2022-08-03T20:22:50+05:30 IST