హుజూరాబాద్‌లో గెలిచేందుకు ప్రజాధనం దుర్వినియోగం

ABN , First Publish Date - 2021-07-27T06:59:10+05:30 IST

హుజూరాబాద్‌ ఎన్నికలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్‌ ఆరోపించారు.

హుజూరాబాద్‌లో గెలిచేందుకు ప్రజాధనం దుర్వినియోగం

దళితబంధు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలి

టీపీసీసీ అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశం

కృష్ణానగర్‌ జూలై 26 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఎన్నికలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్‌ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్‌ కేవలం ఓట్ల కోసం మాత్రమే దళితులను అడ్డం పెట్టుకుంటున్నారని అన్నారు. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రభుత్వ ఖజానా నుంచి దళితబంధు పేరుతో రూ. 2 వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దళితబంధు మాదిరిగానే హుజూరాబాద్‌లో 50 శాతం ఉన్న బీసీలకు బీసీ బంధు ప్రవేశపెట్టాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కొంతమందికి మాత్రమే రూ. 10 వేల వరద సాయం అందించారన్నారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకుడు నల్లంకి ధన్‌రాజ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T06:59:10+05:30 IST