కొత్తసారథి కావాలి

Published: Mon, 14 Mar 2022 02:23:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొత్తసారథి కావాలి

ముకుల్‌ వాస్నిక్‌ను నియమించాలి.. సీడబ్ల్యూసీ భేటీలో జీ-23 నేతల డిమాండ్‌

తిరస్కరించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ.. సోనియానే కొనసాగుతారని స్పష్టీకరణ

వ్యవస్థాగత ఎన్నికల వరకు ఆమేనని తీర్మానం

సోనియా నాయకత్వంపై పూర్తి విశ్వాసం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమకు

ఆందోళన కలిగించాయన్న సమావేశం

పార్టీ వ్యూహాల్లో లోపాలున్నట్లు అంగీకారం

మున్ముందు సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం

చైతన్యవంతమైన ప్రతిపక్షంగా కొనసాగుతాం

ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్న సోనియా

పార్లమెంటు భేటీల తర్వాత చింతన్‌ శిబిర్‌

ఆలోగా మళ్లీ సీడబ్ల్యూసీ భేటీ: వేణుగోపాల్‌ 

ప్రతి కార్యకర్త రాహుల్‌నే కోరుకుంటున్నారు

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సూర్జేవాలా వ్యాఖ్య

నేటి నుంచి రెండోవిడత బడ్జెట్‌ సమావేశాలు

ఉత్సాహంతో బీజేపీ.. నిరుత్సాహంతో విపక్షాలు


న్యూఢిల్లీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని చాలాకాలంగా వ్యతిరేకిస్తున్న జీ-23 నేతలు.. పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మరోసారి తమ అసమ్మతి గళం విప్పారు. ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడు కావాలని, సీనియర్‌ నేత ముకుల్‌ వాస్నిక్‌ను అధ్యక్షుడిగా నియమించాలని ప్రతిపాదించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం పాలుకావడం, పార్టీ నాయకత్వంపై సీనియర్‌ నేతలు అసంతృప్తి స్వరం పెంచిన నేపథ్యంలో పార్టీ అత్యున్నత  నిర్ణాయక కమిటీ అయిన సీడబ్ల్యూసీ ఆదివారం సాయంత్రం సమావేశమైంది. సోనియాగాంధీ అధ్యక్షతన దాదాపు 4 గంటలపాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జీ-23 నేతలు మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆరంభ కాలంలో పార్టీని సోనియాగాంధీ నడిపిన విధంగా కొత్త అధ్యక్షుడు నడపాలని, అలాంటి వ్యక్తికి పార్టీ బాధ్యత లు అప్పగించాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


అంతేకాకుండా.. ప్రస్తుతం పార్టీకి సోనియగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నా కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా మాత్రమే పార్టీని నడిపిస్తున్నారని, వారికి ఎలాంటి జవాబుదారీతనం లేదని ఆరోపించినట్లు పేర్కొన్నా యి. అంతటితో ఆగక ‘‘రాహుల్‌గాంధీ అధ్యక్షుడు కాదు. కానీ, తెరవెనుక నుంచి తతంగం నడిపిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. బయటికి మాత్రం ఏదీ చెప్పరు. మేము పార్టీ శ్రేయోభిలాషులం. శత్రువులం కాదు’’ అని వారు ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు సమాచారం. 57 మంది సభ్యుల సీడబ్ల్యూసీలో జీ-23 నుంచి ఆనంద్‌శర్మ, గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబ్బల్‌ మాత్రమే ఉన్నారు. కాగా, వీరి ప్రతిపాదనను సీడబ్ల్యూసీ తిరస్కరించినట్లు తెలిసింది. అధ్యక్షురాలిగా సోనియాగాంధీయే కొనసాగాలని నిర్ణయించింది. పార్టీ ఎన్నికలు జరిగే వరకు సోనియానే అధ్యక్షురాలిగా ఉండాలని తీర్మానించింది. 


సోనియా నాయకత్వంపై పూర్తి విశ్వాసం..

సోనియాగాంధీ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉందని, వ్యవస్థాగత లోపాలు, రాజకీయ సవాళ్లకు అనుగుణంగా సమగ్రమైన మార్పులకు నాయకత్వం వహించాల్నిందిగా ఆమెను విజ్ఞప్తి చేస్తున్నట్లు సీడబ్ల్యూసీ ఏకగీవ్రంగా తీర్మానించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమకు తీవ్ర ఆందోళన కలిగించాయని తీర్మానంలో పేర్కొంది. పార్టీ వ్యూహాల్లో లోపాలున్నాయని అంగీకరిస్తున్నామని, 4 రాష్ట్రాల్లో బీజేపీ దుష్పరిపాలనను సమర్థవంతంగా ఎండగట్టలేకపోయామని అభిప్రాయపడింది. పంజాబ్‌లో నాయకత్వాన్ని మార్చిన తర్వాత వ్యతిరేకత వచ్చిందని తెలిపింది. ఎన్నికల ఫలితాలను హుందాగా అంగీకరిస్తున్నామని, చైతన్యవంతమైన ప్రతిపక్షంగా కొనసాగుతామని హామీ ఇస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతుందని తెలిపింది. ఈ సమావేశంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున్‌ ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌధురి, పి.చిదంబరం తదితర నేతలు పాల్గొన్నారు. కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సీనియర్‌ నేత ఏకే అంటోని అనారోగ్య కారణాలతో గైర్హాజరయ్యారు. 


త్వరలో మరోసారి భేటీ..

పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు అధినేత్రి సోనియాగాంధీ సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ సమావేశంలో ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు. వర్కింగ్‌ కమిటీ భేటీ అనంతరం తీర్మానాలను ఆయన మీడియాకు వివరించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ‘చింతన్‌ శిబిర్‌’ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఆలోగా మరోసారి వర్కింగ్‌ కమిటీ సమావేశమై వ్యవస్థాగత మార్పులపై చర్చిస్తుందని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి, మార్పులు చేయడానికి పార్టీ అధినేత్రి తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆయా రాష్ట్రాల ఇన్‌చార్జులు నివేదిక అందించారని, ఈ ఫలితాల విశ్లేషణపై జరిగిన చర్చలో వర్కింగ్‌ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారని చెప్పారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీయే కావాలని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారని, అయితే ఆగస్టు 20 తర్వాత జరిగే వ్యవస్థాగత ఎన్నికల్లో తదుపరి అధ్యక్షుడిని నిర్ణయిస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా చెప్పారు. 


కాంగ్రె్‌సకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు: థరూర్‌

దేశంలోని ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రె్‌సకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 1400 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రె్‌సకు 750 మందికి పైగా ఉన్నారని తెలిపారు. ఇతర ఏ పార్టీకీ కాంగ్రె్‌సతో పోలికే లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో అత్యం త విశ్వసనీయత కలిగిన పార్టీ కాంగ్రెస్సేనని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. పార్టీ మనకేం ఇస్తుందని కాకుండా, పార్టీకి మనం ఏమివ్వగలమని కాంగ్రెస్‌ నేతలంతా ఆలోచించుకోవాలని జీ-23 అసమ్మతి నేతల్లో ఒకరైన వివేక్‌ తన్ఖా అన్నారు. కాగా, 5 రాష్ట్రాల ఎన్నికల్లో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది పలురాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రె్‌సను లక్ష్య పెట్టడం లేదు. కర్ణాటక విషయానికి వస్తే.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 


రాహుల్‌గాంధీయే కావాలి 

రాహుల్‌గాంధీయే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ మాణిక్కం ఠాగూర్‌, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వంటివారు కోరారు. ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశానికి ముం దు వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రధాని మోదీని రాహుల్‌గాంధీ ఎదుర్కొన్నట్లుగా ఎవరూ ఎదుర్కోలేరని అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. మోదీపై ఆయన రాజీలేని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రధాని ప్రతిచోటా తన ప్రసంగాన్ని రాహుల్‌గాంధీని లక్ష్యంగా చేసుకొని ప్రారంభిస్తారని, దీన్ని బట్టే ఆయన పోరాటాన్ని అర్థం చేసుకోవాలని గహ్లోత్‌ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ వెంటనే కాంగ్రెస్‌ పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డీకే శివకుమార్‌ కోరారు. తాను ముందునుంచీ ఇదే చెబుతున్నానని ట్వీట్‌ చేశారు. అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలన్నదే కాంగ్రెస్‌ కార్యకర్తల కోరిక అని మాణిక్కం అన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీలపై పోరాడగలిగేది కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని ఠాగూర్‌ స్పష్టం చేశారు. కాగా.. ఆదివారం సీడబ్ల్యూసీ భేటీ నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు రాహుల్‌గాంధీకి అనుకూలంగా నినాదాలు చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.