సోషల్ మీడియాలో మరోసారి అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-03-05T00:12:43+05:30 IST

అస్సాం శాసన సభ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్

సోషల్ మీడియాలో మరోసారి అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్

గువాహటి : అస్సాం శాసన సభ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ వాడుతున్న ఫొటోలు తైవాన్ తేయాకు తోటకు సంబంధించినవని బీజేపీ ఆరోపించింది. అస్సాం సౌందర్యాన్ని కాంగ్రెస్ గుర్తించలేకపోతోందని దుయ్యబట్టింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. 


126 స్థానాలున్న అస్సాం శాసన సభ ఎన్నికలు మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ‘అస్సాంను కాపాడండి’ నినాదంతో కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపును తేయాకు తోటల కార్మికులు ప్రభావితం చేయగలరు. దీంతో వీరిపై కాంగ్రెస్, బీజేపీ వరాల జల్లు కురిపిస్తున్నాయి. 


ఇదిలావుండగా, ‘అస్సాం బచావో’ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పెట్టిన రెండు ఫొటోలను అస్సాం ఆర్థిక మంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ గురువారం ఇచ్చిన రెండు ట్వీట్లలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు తైవాన్ తేయాకు తోటలో తీసినవని ఆరోపించారు. 


శర్మ ఇచ్చిన మొదటి ట్వీట్‌లో ‘‘అస్సాంను కాపాడాలంటూ తైవాన్ తేయాకు తోట ఫొటోను కాంగ్రెస్ అధికారిక ప్రచార పేజ్‌లో వాడుతున్నారు. కాంగ్రెస్ నేతలు అస్సాంను గుర్తించలేరా? ఇది అస్సాంకు అవమానకరం, మన రాష్ట్ర తేయాకు తోటల కార్మికులకు అవమానకరం’’ అని మండిపడ్డారు. 


రెండో ట్వీట్‌లో, ‘‘మొదట కాంగ్రెస్ అస్సాంను గుర్తించలేకపోయింది, ఇప్పుడు అస్సామీలను సైతం గుర్తించలేకపోతోంది. ఇది కూడా తైవాన్ ఫొటోయే. కాంగ్రెస్ నేతలు అస్సాంను మర్చిపోయారు. మన గడ్డ ఎంత సుందరమైనదో కాంగ్రెస్‌కు చూపిద్దాం’’ అని పేర్కొన్నారు. 


హిమంత బిశ్వ శర్మ ఆరోపణలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ నేత బొబీత శర్మ మాట్లాడుతూ, బీజేపీ కలవరపడుతోందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు చేరువవుతున్నారని, అభివృద్ధి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ వాగ్దానాల ఆట ముగిసిన తర్వాత అస్సామీలకు చెప్పడానికి ఆ పార్టీకి ఏమీ మిగల్లేదన్నారు. అందుకే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-03-05T00:12:43+05:30 IST